నేనే సీఎం ను అయితే… ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు…!

* ఒలింపిక్ డే రన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ధర్మాన
కృష్ణదాస్
* నేనే సి.ఎం అయితే క్రీడలకు అధికప్రాధాన్యం
* ఆరోగ్య సమాజానికి క్రీడలు దోహదం
* డైనమిక్ సి.ఎం జగన్ ఆద్వర్యంలో క్రీడలకి మంచి రోజులు

నేనే సీఎం అయ్యుంటే క్రీడలకు ఎంతో ప్రాధాన్యం కల్పించేవాడినని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ,ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు.ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిననాడే సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసారు.రాష్ట్రంలోని క్రీడలకు డైనమిక్ సి.ఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో మంచిరోజులు వస్తాయన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్నామన్నారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఒలంపిక్ డే రన్ కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.శ్రీకాకుళంలోని అంబేద్కర్ జంక్షన్ లో ఒలింపిక్ జ్యోతిని అందుకొన్న ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ జెండా ఊపి ప్రారంభించిన 2K రన్ లో పాల్గొన్నారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి ఏడురోడ్ల జంక్షన్ వద్ద గల ఎన్.టి.ఆర్ .ఎం.హెచ్ స్కూల్ మైదానం వరకూ ఈ రన్ కొనసాగింది.

రాష్ట్ర మంత్రి కృష్ణదాస్ తో పాటు జిల్లా కలెక్టర్ నివాస్ ,జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి ఇతర అధికారులు,క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు క్రీడలకు లక్షల్లో …వైద్యం ,ఆరోగ్యానికి కోట్లలో బడ్జెట్ లు కేటాయించాయన్నారు.క్రీడలను వదిలేసి ఆరోగ్యం కోసం కోట్లు ఖర్చు పెడితే ఏం లాభమన్నారు . ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రానికి జగన్ రూపంలో డైనమిక్ సీఎం దొరికారని..ఏపీలో క్రీడలకు మంచిరోజులొచ్చాయన్నారు . క్రీడలకు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి …బడ్జెట్ లో స్పోర్ట్సుకు ఎక్కువ నిధులు కేటాయించేలా చేస్తామన్నారు మంత్రి దాసన్న.

About The Author