పద్మశ్రీ వచ్చింది.. ఉపాధి పోయింది…!
ఒంటిచేత్తో వంద ఎకరాలకు నీరిచ్చిన వ్యక్తికి ఇప్పుడు ఉపాధి కరవైంది. ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో నీరు ప్రవహిస్తున్నా.. కాలువ వసతి లేక ఊరంతా ఎడారిగా మారింది. దీన్ని చూసి చలించిన ఓ వ్యక్తి ఎలాగైనా ఊరి కరవును పారదోలాలనకున్నాడు. ఏదేమైనా ఊరికి నీటిని తేవాలని సంకల్పించాడు. కొండల్ని, బండల్ని సైతం పగలగొట్టి ఎట్టకేలకు గ్రామంలోని పొలాలను తడిపాడు. ఎంతో మంది ఆకలి తీర్చాడు. ఆయన కృషిని ప్రభుత్వం గుర్తించింది. దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. కానీ, ఆ అవార్డే ఇప్పుడు ఆయనకు ఉపాధిని దూరం చేసింది. వివరాల్లోకి వెళితే…
ఒడిశాలోని వైతరిణి గ్రామంలో దైతారీ నాయక్ (75) ఓ చిన్న రైతు. ఊరంతా కరవుతో అల్లాడిపోతుంటే చూడలేక కొండలు, గుట్టల మధ్య నుంచి కుటుంబసభ్యుల సాయంతో మూడు కిలోమీటర్ల కాలువ తవ్వి పంటభూముల గొంతు తడిపాడు. ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కానీ, ఆ సత్కారమే ఇప్పుడు తనకు ఉపాధిని దూరం చేసిందంటున్నారు దైతారీ. అదేలాగో ఆయన మాటల్లోనే..‘‘ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారం నాకు ఏవిధంగా సాయపడలేదు. గతంలో నేను దినసరి కూలీగా పనిచేసేవాణ్ని. ఇక అవార్డు వచ్చినప్పటి నుంచి నన్ను ఎవరూ పనికి పిలవట్లేదు. ప్రభుత్వం నిన్ను గొప్ప వ్యక్తిని చేసింది.. ఇప్పుడు మేం నిన్ను పనికి పిలిస్తే నీ గౌరవాన్ని తగ్గించినట్లవుతుందంటున్నారు. దీంతో ఉపాధి లేక ఇల్లు గడవడం కష్టమైపోయింది. బీడీ ఆకులు, అప్పడాలు అమ్ముకుంటున్నాం. అవార్డుతో గ్రామంలో నాకున్న విలువ తగ్గిపోయింది. ఇక నేను పురస్కారాన్ని తిరిగిచ్చేయాలనుకుంటున్నాను. అప్పుడైనా నాకు కొంచెం పని దొరుకుంతుందేమో’’ అని దైతారీ తన పరిస్థితిని వివరిస్తూ వాపోయారు.
ప్రస్తుతం దైతారీ తన స్వగ్రామంలో ఓ చిన్న పూరి గుడిసెలో నివాసముంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైనా.. డబ్బుల్లేక దాన్ని మధ్యలోనే ఆపేశారు. ఆయన కుమారుడు అలేఖ్ కూడా దినసరి కూలీగానే పనిచేస్తున్నారు. ‘‘అవార్డు అందుకున్న సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. మేం తవ్విన కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేస్తామన్నారు. ఊరికి రోడ్లు వేయిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకూ అవేవీ నెరవేరలేదు. దీంతో గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోతున్నానని మా నాన్న నిరాశకు గురవుతున్నారు’’ అని అలేఖ్ తెలిపారు.
దైతారీ దుస్థితిపై ఆ జిల్లా పాలనాధికారి ఆశిశ్ ఠాక్రే స్పందించారు. ఆ పేద రైతుకి వచ్చిన సమస్యలేంటో తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చూడాలి మరి.. గ్రామ ప్రజల కోసం కష్టపడి వంద ఎకరాల గొంతు తడిపి.. అనేక మంది అన్నదాతల కన్నీళ్లను తుడిచిన ఈ శ్రమజీవి కష్టం తీరుతుందో..లేదో..!