భారతదేశ విత్తన పరిశ్రమలో తెలంగాణ పెద్దన్న పాత్ర…
భారతదేశ విత్తన పరిశ్రమలో తెలంగాణ పెద్దన్న పాత్ర పోషిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో గత ఐదేళ్లలో తెలంగాణ విత్తనోత్పత్తికి చిరునామాగా మారిందని, ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ ఎదిగేందుకు అంతర్జాతీయ విత్తన సదస్సు దోహద పడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. హైదరాబాద్ నోవాటెల్ లో బుధవారం అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో ప్రైవేటు విత్తనరంగ సంస్థలకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తూనే, ప్రభుత్వ విత్తన రంగ సంస్థలను బలోపేతం చేస్తామని, నాణ్యమయిన విత్తనమే వ్యవసాయాభివృద్దికి మూలం అని, విత్తన నాణ్యత, సరఫరా పెరిగేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలని నిరంజన్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థలలో విత్తన పరిశ్రమ ఒకటి అని, ఆధునిక శాస్త్రీయతను విత్తనానికి ఆపాదించి నాణ్యమయిన విత్తనాలను రూపొందించాలని, తెలంగాణ నుండి ఏడాదికి 65 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే విత్తనోత్పత్తికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, ఇప్పటికే ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ & డెవలప్ మెంట్) విత్తన దృవీకరణ వ్యవస్థ ద్వారా పలు దేశాలకు తెలంగాణ నుండి విత్తనాల ఎగుమతి కొనసాగుతుందని, ఐరోపా దేశాలకు కావలసిన విత్తనాలను దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయని, భారతదేశం నుండి విత్తనాలను ఎగుమతి చేసేందుకు అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన అనుమతులు రాగానే తెలంగాణ నుండి విత్తనాలను ఎగుమతి చేయడం ప్రారంభిస్తామని నిరంజన్ రెడ్డి గారు అన్నారు. విత్తనోత్పత్తిపై రైతాంగానికి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, వారికి మౌళిక సదుపాయాల కల్పనతో పాటు, సాంకేతిక సహకారం అందిస్తామని, రైతులకు విత్తనోత్పత్తిలో సహాయంగా ఉండే పాలసీలను తీసుకువస్తామని మంత్రి గారు స్పష్టం చేశారు. తెలంగాణ విత్తనోత్పత్తిలో కీలకంగా ఎదిగేందుకు ప్రభుత్వ పాలసీలతో పాటు ఇక్కడి అనుకూల వాతావరణం, తెలంగాణ రైతుల శ్రద్దతో పాటు పరిశోధనా సంస్థల సహకారం ఉందని, మానవ మనుగడకు అంత్యంత కీలకం ఆహార పంటల సాగు అని, అందులో ప్రధాన భూమిక విత్తనాలది అని, నాణ్యమయిన విత్తనాలు లేకుంటే ఇది సాధ్యం కాదని అన్నారు. సదస్సుకు ఇస్టా ప్రెసిడెంట్ డాక్టర్ క్రెగ్ మెక్ గ్రిల్, జాతీయ విత్తన సంయుక్త కార్యదర్శి అశ్వనీకుమార్, జాతీయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, వ్యవసాయ కమీషనర్ రాహుల్ బొజ్జా, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, యాదయ్య, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, వేర్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ మందుల సామేలు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, ఆగ్రోస్ చైర్మన్ కిషన్ రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు వందన సమర్పణతో తొలిరోజు సదస్సు ముగిసింది. గురువారం సదస్సులో కీలకమయిన విత్తనోత్పత్తి రైతుల సమావేశం జరగనుంది.
———————————————-
విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూలం
– దేశంలో 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే 400 పైగా తెలంగాణలోనే
– విత్తనరంగ అభివృద్దికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అభినందనలు
– రైతాంగ అభివృద్దికి విత్తనమే కీలకం
– ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న భారతీయ విత్తన పరిశ్రమ
– ఆసియా దేశాలలో తొలిసారి భారత్ లో నిర్వహించడం గర్వకారణం
– నాణ్యత గల విత్తనాలు అవసరం మేర అందించేందుకు భారత ప్రభుత్వ కృషి
– పత్తి విత్తనోత్పత్తిలో ప్రపంచంలో భారత్ దే అగ్రస్థానం
– వందకు పైగా వ్యవసాయ పరిశోధనా సంస్థలు, 60కి పైగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విత్తనాలు, పంటల అభివృద్దిపై రైతులకు సహకారం అందిస్తున్నాయి
– 1966లోనే దేశంలో భారత విత్తన చట్టం రూపొందించుకున్నాం
– అంతర్జాతీయ విత్తన సదస్సు(ISTA)లో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి
దేశంలో విత్తనాలు ఉత్పత్తి చేయడానికి అనువైన వాతావరణం తెలంగాణలోనే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే తెలంగాణలోనే 400కు పైగా ఉన్నాయి. తెలంగాణలో విత్తనరంగ అభివృద్దికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అభినందనలు అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి అన్నారు. హైదరాబాద్ నోవాటెల్ లో బుధవారం అంతర్జాతీయ విత్తన సదస్సు(ISTA)కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ప్రసంగించారు. రైతాంగ అభివృద్దికి, దేశ ఆహార భద్రతకు విత్తనమే కీలకమని, ఆసియాలో తొలిసారి అంతర్జాతీయ విత్తన సదస్సు భారతదేశంలో జరగడం గర్వకారణం అని, ప్రపంచంలోనే పత్తి విత్తనోత్పత్తిలో భారత్ ది అగ్రస్థానం కాగా వరి, గోధుమ, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, కూరగాయలలో మేలైన విత్తనాల ఉత్పత్తి జరుగుతుందని ఆయన అన్నారు.
దేశంలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం అభివృద్ది చెందితేనే, దేశం ఆర్థిక పరిపుష్టి సాధిస్తుందని, మారుతున్న పర్యావరణం, తరుగుతున్న సహజవనరుల నేపథ్యంలో వ్యవసాయ ఉత్పాదకత పెంచాలంటే నాణ్యమయిన విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చి సరఫరా చేయాల్సిన అవసరం ఉందని కైలాష్ చౌదరి అన్నారు. ప్రపంచంలో భారతీయ విత్తన పరిశ్రమ వేగంగా ఎదుగుతుందని, ఆసియా దేశాలలో తొలిసారి భారతదేశంలో విత్తన సదస్సు నిర్వహించడం గర్వకారణం అని, నాణ్యత గల విత్తనాలు అవసరం మేర రైతాంగానికి అందించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దేశంలో వందకు పైగా వ్యవసాయ పరిశోధనా సంస్థలు, 60కి పైగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విత్తనాలు, పంటల అభివృద్దిపై రైతులకు సహకారం అందిస్తున్నాయని, ఒక జాతీయ, 16 రాష్ట్ర స్థాయి విత్తన కార్పోరేషన్లు, 26 రాష్ట్ర విత్తన దృవీకరణ ఏజన్సీలు, విత్తన లా ఎన్ ఫోర్స్ మెంట్ అధారిటీ ద్వారా విత్తనాల నాణ్యత పరీక్షించడం జరుగుతుందని, 1966లోనే దేశంలో భారత విత్తన చట్టం రూపొందించుకుని నాణ్యమయిన విత్తనాలు రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నామని, దానిని భవిష్యత్ లో కొనసాగిస్తామని అన్నారు.
———————————————-
నాణ్యతకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది
– రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ గారు
నాణ్యమయిన ఉత్పత్తులకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, తెలంగాణ విత్తనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదరణ పొందడానికి అదే కారణం అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ గారు అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సుకు గౌరవ అతిథిగా హాజరయిన ఆయన మాట్లాడుతూ ఇస్టా సదస్సు మూలంగా విత్తన పరీక్షా ప్రమాణాలు మన రైతులకు, మన నిపుణులకు తెలుస్తాయని, దానికి అనుగుణంగా పంటలు పండించి విత్తనాలను రూపొందించడం మూలంగా జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణ విత్తనాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు
—————————————-
ప్రమాణాల పెరుగుదలకు సదస్సు దోహదం చేస్తుంది
– వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి
వివిధ దేశాల విత్తన అవసరాలు, ప్రమాణాలు పరస్పరం తెలుసుకునేందుకు అంతర్జాతీయ విత్తన సదస్సు వేదికగా ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విత్తన మొలకశాతం, నాణ్యత పరీక్షలు, బయోటెక్నాలజీ వంటి అంశాలపై జరిగిన పరిశోధనా ఫలితాలు అందరూ తెలుసుకునేందుకు ఇది అవకాశం అని, తెలంగాణ విత్తన బ్రాండ్ ను అంతర్జాతీయంగా మార్కెట్ చేయడానికి, నూతన ఎగుమతి అవకాశాలు దీంతో మెరుగవుతాయని అన్నారు.
——————————————
ఇస్టా కాంగ్రెస్ లో సాంస్కృతిక వైభవం
– భారతీయ, తెలంగాణ కళా ప్రదర్శనలు
– 80 దేశాల నుండి వచ్చిన 800 మంది ప్రతినిధులు ఫిదా
– ఆకట్టుకుంటున్న తెలంగాణ కళారూపాలు
– అంతర్జాతీయ విత్తన సదస్సు వేదికపై అలరించిన ఒగ్గుడోలు, భారతీయం నృత్యరూపకం
– చర్చల మధ్యలో ప్రతినిధులకు మానసికోల్లాసం
– సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సారధ్యంలో కార్యక్రమాలు