అది శునకమా ? కాదు.. ప్రాణదేవత..


అది శునకమా ? కాదు .. ప్రాణదేవత ..
తన ప్రాణం అర్పించి -కాపాడి..

శునకం అంటే విశ్వాసానికి మారుపేరు. ఈ మాట మరోమారు రుజువైంది. మేకల మందను తోలుకొని కొండ ప్రాంతానికి వెళ్తున్న నలుగురి కాపర్ల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో శునకం మృతి చెందింది. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీ చిలకనగర్‌ కాలనీలో పది కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరూ మేకలు మేపుకొని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం నలుగురు కాపర్లు మేకల మందను భైరవుని కొండ ప్రాంతానికి తోలుకెళ్లారు. మార్గమధ్యలోని తిప్పల సమీపానికి చేరుకోగానే మేకలన్నీ మేత కోసం పరుగులు తీశాయి. వాటి కాపర్లు మాటల్లో వెనుకబడి పోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు 11 కేవీ విద్యుత్తు స్తంభం నేలకూలిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. నేటికీ విద్యుత్‌ ప్రసరణ జరుగుతుండటంతో మందలోని ఓ మేక కరెంటు తీగకు తగిలి మృతి చెందింది. దీన్ని గమనించిన కుక్క మిగిలిన మేకలు అటువైపు వెళ్లకుండా అడ్డుపడింది. అనంతరం పెద్దగా అరవడంతో కాపర్లు… అటువైపు వెళ్లి మేక మృతి చెంది ఉండటాన్ని గమనించారు. ఘటనా స్థలం నుంచి మిగిలిన మేకలను వెనక్కి తరిమే ప్రయత్నంలో శునకం సైతం విద్యుదాఘాతానికి గురై చనిపోయింది. ఆ కుక్కే లేకపోయి ఉంటే తాము కరెంటు తీగ తగిలి ప్రాణాలు విడిచే వారమని కాపర్లు వాపోయారు. స్తంభం కూలి విద్యుత్తు ప్రసరణ కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

About The Author