కాప్రికార్న్ ఫుడ్ ఫ్యాక్టరీ లో కూలిన రేకుల షెడ్డు…బాలిక మృతి, తొమ్మిది మందికి తీవ్ర గాయాలు
బాలిక మృతి, తొమ్మిది మందికి తీవ్ర గాయాలు
సత్యవేడు మండలం చిన్న ఈ టి పాకం పంచాయతీ పాల గుంట కాప్రి కార్న్ ఫుడ్ ఫ్యాక్టరీ లో శనివారం విషా
దం చోటుచేసుకుంది. ఫుడ్ ఫ్యాక్టరీ ఆవరణలో కూలీలు నివసిస్తున్న రేకుల షెడ్డు కూలిపోవడంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బడే యం జిల్లా సానా ఫర్ గ్రామానికి చెందిన ఇరి ఫన్ కుమార్తె బాలిక నిషా(7) మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో అభిషేక్ ఖాన్(5), సోల్ ఖాన్(3), ఆకాశ్(16), అస్లాం(11), యాష్ మీ(10), దీపక్ చౌదరి(36), సహన(11), సతీష్(27), జు పేద(8) తదితరులు ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాల గుంట ఫుడ్ ఫ్యాక్టరీ లో పని చేయడానికి కాంట్రాక్ట్ పద్ధతిపై పలువురు కార్మికులను మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి రప్పించారు. వీరి నివాసానికి సంబంధిత ఫుడ్ ఫ్యాక్టరీ యాజమాన్యం రేకుల షెడ్లను నిర్మించింది. ఈ రేకుల షెడ్ లో నే పిల్లాపాపలతో నివాసముంటూ కార్మికులు ఫుడ్ ఫ్యాక్టరీ లో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం గాలులు అధికంగా వీచడంతో కార్మికుల నివాసముంటున్న రేకుల షెడ్డు కుప్పకూలింది. దీంతో రేకుల షెడ్డు లలో ఉన్న పిల్లలపై పడడంతో నిషా అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. రేకుల షెడ్లు కూలిన వెంటనే దాని కింద చిక్కుకున్న పిల్లలను బయటకు లాగి సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేకుల షెడ్డు కూలిన సమయానికి కార్మికులంతా పనికి వెళ్లడం తో పిల్లలు మాత్రమే ప్రమాదానికి గురయ్యారు. గాయాలపాలైన వారిలో సహన, సతీష్, జూ పేద పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు తిరుపతి రుయా ఆసుపత్రికి సిఫార్సు చేశారు. వీరికి తల, కాళ్లు వద్దా తీవ్రంగా గాయాల పాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతికి తరలించడం జరిగింది. మిగిలినవారికి సత్యవేడు ప్రభుత్వాస్పత్రిలో వైద్యాధికారి రమేష్ చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన తెలుసుకున్న ఎస్ఐ మల్లికార్జున హుటాహుటిన పాల గుంట ఫుడ్ ఫ్యాక్టరీ కి చేరుకొని ప్రమాద కారణాలను ఆరా తీశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నారు.
కార్మికుల భద్రతను గాలికొదిలేసిన కంపెనీ యాజమాన్యం.
పాల గుంట ఫుడ్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల భద్రతను గాలికొదిలేయడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫుడ్ ఫ్యాక్టరీ లో తరచూ ప్రమాదాల సంభవిస్తూ పలువురు కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్న సంబంధిత కంపెనీ యాజమాన్యానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వందలాది మంది కార్మిక కుటుంబాలు నివసిస్తున్న రేకుల షెడ్లు పటిష్టంగా లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాద సంఘటనలో చోటుచేసుకుంటున్నట్లు కార్మికుల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ మోస్తరు గాలుల కే రేకుల షెడ్డు కుప్పకూలింది అంటే వాటి నాణ్యత ఏ పాటిదో దీన్నిబట్టి బోధపడుతుంది. నాసిరకం పనులు వల్లే రేకుల షెడ్లు కుప్ప కూలిందన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వందలాది మంది కార్మికులు నివసిస్తున్న రేకుల షెడ్డులను పటిష్టంగా నిర్మించాలన్న ధ్యాస సంబంధిత కంపెనీ యాజమాన్యానికి లోపించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా లాభాపేక్ష ధోరణితో కంపెనీ యాజమాన్యం వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రమాద సంఘటనలు తరుచూ పాల గుంట ఫుడ్ ఫ్యాక్టరీ లో చోటు చేసుకోవడం రివాజుగా మారుతుంది. పైగా కార్మికుల సంక్షేమం, వారి భద్రత, కార్మికులకు అందుతున్న వేతనాలు, తదితర వాటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన కార్మిక శాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ ప్రమాదాల సంభవిస్తూ కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్న సంబంధిత కార్మిక శాఖ పట్టించుకోకపోవడం శోచనీయమని కార్మికులు పలువురు వాపోతున్నారు. జానెడు పొట్ట కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రత కల్పించడంలో సంబంధిత కంపెనీ యాజమాన్యం విఫలం కావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల భద్రతకు ముప్పు వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవడంతోపాటు, వారి సంక్షేమానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కార్మికుల భద్రతను గాలికొదిలేసిన పాల గుంట ఫుడ్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు….