ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను…


ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను నష్టాల నుండి కాపాడేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతోందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య వెల్లడించారు. సోమవారం సచివాలయం రెండవ భవనంలో రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధ్యక్షతన 2019 బడ్జెట్ అంచనాలపై శాఖలవారీగా జరిగిన సమావేశంలో రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖలకు సంబంధించిన జరిగిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి పేర్ని వెంకట్రామయ్య మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసిని నష్టాల నుండి గట్టెక్కించాలంటే సుమారు 6 వేల 900 కోట్ల రూ.లు అవసరం ఉంటుందని, ఈ నష్టాల నుండి ఆర్టీసీని గట్టెక్కించాలని ఆర్థిక మంత్రికి విజ్ణప్తి చేశామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యనిధికి సంబంధించిన 3వేల కోట్ల రూ.లను నేరుగా వాడేశారని, ఉద్యోగులకు పెంచిన వేతన సవరణ బకాయిలు ఇంతవరకూ చెల్లించలేదని పేర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే విధంగా ఆర్టీసిని గట్టెక్కించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
అదే విధంగా రవాణాశాఖలో సుమారు 100 ఖాళీలను తక్షణం భర్తీ చేయాల్సి ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థికమంత్రిని కోరామని మంత్రి వెంకట్రామయ్య వెల్లడించారు. అలాగే సమాచార పౌరసంబంధాల శాఖకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రికి సమర్పించామని చెప్పారు. బుధవారం మరొకసారి సమావేశం అవుదామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సూచించారని, ఆ సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక,రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, కృష్ణబాబు, ఆర్టీసి ఎండి సురేంద్ర బాబు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ కుమార్ రెడ్డి, అదనపు సంచాలకులు శ్రీనివాస్, ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

About The Author