శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం గోడపత్రికలు ఆవిష్కరణ…

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 8వ తేదిన జరుగనున్న పుష్పయాగ మహోత్సవం గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆవిష్క‌రించారు. తిరుప‌తి జెఈవో నివాసంలోని కార్యాలయంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ జూలై 7న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు సేనాధిప‌తి ఉత్స‌వం, పుష్పయాగానికి అంకురార్పణ జరుగనుందని తెలిపారు. జూలై 8న ఉదయం 9.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారని వివ‌రించారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి వారికి అభిషేకం చేస్తారని చెప్పారు. అనంతరం సాయంత్రం 6.00 గంటలకు వీధి ఉత్సవం జరుగనుందని తెలిపారు. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చ‌న్నారు. ఈ పుష్పయాగంలో భక్తులు పాల్గొని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి దివ్య అనుగ్రహం పొందాలని జెఈవో కోరారు.

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారన్నారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ రవికుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీ కామరాజ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author