ప్రముఖ పారిశ్రామికవేత్త బసంత్ బిర్లా మృతి…
బిర్లా గ్రూప్ వ్యవస్థాపకుడు ఘన్‌శ్యామ్ బిర్లా కనిష్ఠ పుత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బసంత్ బిర్లా నేటి సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
98 సంవత్సరాల #బసంత్‌బిర్లా, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదిత్య విక్రమ్ బిర్లాకు తండ్రి కాగా, నేటి తరం పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు తాతగారు.బసంత్ కుమార్ బిర్లాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, ఆదిత్య విక్రమ్ బిర్లా 1995లో మరణించారు.
బసంత్ బిర్లా స్థాపించిన వ్యాపార సామ్రాజ్యంలో అత్యంత కీలకమైనవి సెంచురీ టెక్స్‌టైల్స్, కేశోరాం ఇండస్ట్రీస్. కాటన్, విస్కోస్, పాలిస్టర్, నైలాన్ యార్న్, రిఫ్రాక్టరీస్, పేపర్, షిప్పింగ్, టైర్‌కోర్డ్, ట్రాన్స్‌పరెంట్ పేపర్, స్పన్ పల్ప్, సిమెంట్, టీ, కాఫీ, కెమికల్స్, ప్లేవుడ్ వంటి పలు రంగాలు ఉన్నాయి.
15 ఏళ్ళ వయసు నుంచే వ్యాపార రంగలో ఉన్న బసంత్ బిర్లా అనేక విద్యా సంస్థలను నెలకొల్పారు. బిట్స్ పిలాని, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సస్, బీకే బిర్లా సెంటర్, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, జీడీ మెమోరియల్ స్కూల్ ఫర్ బాయ్స్, అశోక్ హాల్ గర్ల్స్ స్కూల్‌తో పాటు సుమారు 25 విద్యాసంస్థలను బసంత్ కుమార్ బిర్లా నెలకొల్పారు.
హైదరాబాద్, న్యూఢిల్లీ, కాన్పూర్, కోల్‌కతా, కురుక్షేత్ర, షహద్, భోపాల్, బిట్స్ పిలాని, జైపూర్, పాట్నా, అకోలా, వారణాసి, రెనూకోట్, నగాడా, బ్రజ్‌రాజ్‌నగర్, గ్వాలియర్, ఆలిబాగ్‌లలో బిర్లా మందిర్‌లను నిర్మించడంలో బసంత్ కుమార్ బిర్లా కీలక పాత్ర పోషించారు.
బిర్లా గ్రూప్ నేతృత్వంలో ఎనిమిది స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి… వీటి ఏర్పాటులో బసంత్ కుమార్ బిర్లా కీలక పాత్ర పోషించారు.