భోజన సమయానికి మీరు APSRTC బస్సులో ప్రయాణిస్తున్నారా…?


భోజన సమయానికి మీరు APSRTC బస్సులో ప్రయాణిస్తున్నారా…? అయితే మీ ఆరోగ్యం,జేబు తస్మాత్ జాగ్రత్త…!

అక్రమార్కులకు కాదేదీ అనర్హం… చివరకు ప్రజల అరోగ్యానికి సంబంధించినది అయినా… డోంట్‌కేర్, తమ జేబులు నిండితే చాలు…

ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సురక్షిత ప్రయాణాన్ని అందించడమే కదా APSRTC విధి, సంస్థకు ప్రజల ఆరోగ్యానికి, కి సంబంధం ఏమిటి…? అంటారా…? అక్కడికే వస్తున్నాం…

అన్న, పానాదులు, ప్రకృతి కార్యక్రమాలకు ఏమనిషీ అతీతుడు కాడు… రైళ్ళలో అయితే వీటి కోసం ప్రత్యేకంగా ఎక్కడా ఆపవలసిన అవసరం లేదు… ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న బస్సులను ఆ సమయానికి ఎక్కడో ఒక దగ్గర ఆపాల్సిందే… సరిగ్గా ఇక్కడే సంస్థలోని కొందరు అధికారులు హైవేల పై ఉన్న నాసిరకం దాబాలు, హోటళ్ళ తో కాసులకోసం కక్కుర్తి పడి, ప్రజారోగ్యాన్నే కాదు సంస్థకు మూలస్థంబాలైన డ్రైవర్ల ఆరోగ్యాన్నీ ప్రమాదంలోకి నెట్టుతున్నారు.

నిబంధనల ప్రకారం ప్రతి RTC బస్సు, వాటి మార్గంలోని ముఖ్యమైన బస్టాండులకు విధిగా వెళ్ళాలి, దూర ప్రాంత సర్వీసుల ప్రయాణీకుల సౌకర్యార్ధం,నిర్ణీత దూరం తర్వాత సమీపంలో ఏ RTC బస్టాండ్ లేకపోతే… హైవే పై ఉన్న హోటళ్ళను సంస్థ ముందుగా ఎంపిక చేసి, అక్కడి సౌకర్యాలు అనగా భోజనశాల,వసతి,మరుగుదొడ్లు వంటివి నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఆ ప్రదేశాలలో సదరు బస్సులను నిలిపేందుకు అనుమతి ఇవ్వాలి, కానీ నిబంధనలు పేపరుకే పరిమితం చేస్తూ… ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు APSRTC అధికారులు…

ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత, హైదరాబాద్ – విజయవాడ మధ్య సర్వీసుల సంఖ్య పెరిగింది, నిత్యం వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు… ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 5 నుంచి 6 గంటలే అయునా… నార్కెట్‌పల్లి – సూర్యాపేట మధ్య తప్పనిసరిగా ఆగవలసిన పరిస్థితి..‌.. అయితే అటు విజయవాడ నుంచి గానీ… లేక హైదరాబాదు నుంచి ప్రయాణం సాగించే సర్వీసులు అన్ని వసతులు ఉన్న సూర్యాపేట RTC బస్టాండులో కాక, శివార్లలోని హోటళ్ళ వద్ద ఆపాలంటూ అధికారులు పేర్కొనడంతో… అక్కడి నిర్వాహకులది ఇష్టారాజ్యంగా మారింది… హోటళ్ళలో నాసిరకం ఆహార పదార్ధాలను ప్రముఖ రెస్టారెంట్లలో కూడా ఉండని ధరకు కొనాల్సిందే… పోనీ బిస్కెట్లు వంటి వాటితో సరిపెట్టుకొందాము అంటే… ఏ వస్తువుకు MRP అన్నది ఉండదు, ముద్రించిన MRP ని చెరిపేసి, వారు చెప్పిన ధరలకే కొనాల్సిన దుస్థితి…

అదేమిటి అని గట్టిగా నిలదీస్తే… నిర్లక్ష్య సమాధానం, భౌతిక దాడులూ ఎదుర్కోవాల్సిందే… ఇటువంటి చోట ఎందుకు ఆపుతారు అని డ్రైవరు గారిని అడిగితే… మేము ఏమీ చేయలేము, మా అధికారులు చెప్పిన ప్రకారం.. మా SRల పై సదరు హోటళ్ళ ముద్ర సంతకం తప్పనిసరి అంటూ వాపోతున్న దౌర్భాగ్యపు పరిస్థితి.

ఇప్పటికైనా సంస్థ ఉన్నతాధికారులు సమస్య తీవ్రతను గుర్తించి తగు చర్యలు తీసుకొని, సౌకర్యవంతమైన ప్రయాణంలో నాణ్యమైన ఆహారమూ ఓ భాగమే అన్న విషయాన్ని అర్ధం చేసుకొంటారని భావిద్దాం…

About The Author