పేగుల నుంచి 6.3 అడుగుల పొడవైన పురుగు…


కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బాధితుడి పేగుల నుంచి సుమారు 6.3 అడుగుల పొడవైన పురుగు బయటపడడమే ఇందుకు కారణం. హరియాణాలోని కైతల్‌ జిల్లా జింద్‌ నగరంలో నివసించే ఓ వ్యక్తి చాలా రోజుల నుంచి జ్వరం, కడుపునొప్పితో బాధపడేవారు. చాలా చోట్ల చికిత్స చేయించుకున్నా నొప్పి తగ్గలేదు. దీంతో జింద్‌లోని జైపుర్‌ ఆసుపత్రి వైద్యులను ఆశ్రయించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. పొట్ట నుంచి సజీవ పురుగులను తొలగించారు. అందులో ఓ పురుగు ఏకంగా 6.3 అడుగుల పొడవు ఉంది. ‘‘వారం నుంచి ఏమీ తినాలనిపించేది కాదు. 3 రోజులు తర్వాత కడుపులో నొప్పిగా అనిపించింది. వైద్యులు శస్త్రచికిత్స చేసిన తరువాత పురుగు బయటకు వచ్చింది. ముందుగా చిన్నగానే కనిపించింది. తరువాత తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. పురుగును మొత్తం తొలగించారు’’ అని బాధితుడు తెలిపారు. ఈ కీటకం శాస్త్రీయ నామం ‘టినియా సోలియం’ అని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. పచ్చి మాంసం, కూరగాయలను కడగకుండా తినడం వల్ల ఈ పురుగు కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.

About The Author