డాక్టర్లు చేతులెత్తేశారు…108 సిబ్బంది చేసి చూపించారు…


నెలలు నిండిన గర్భిణికి పురిటినొప్పులు మొదలయ్యాయి.. ప్రసవ కష్టంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.. ఇక్కడ కాన్పు చేయలేం. అవసరమైన పరికరాలు లేవు.. ఇక్కడి నుంచి రాజంపేటకు తీసుకెళ్లండి.. అంటూ వైద్యులు చేతులెత్తేశారు. గత్యంతరం లేక పురిటి నొప్పులతో 108 వాహనం ఎక్కిన గర్భిణికి మార్గమధ్యంలో సిబ్బంది సురక్షిత కాన్పు చేసి తల్లీబిడ్డను కాపాడారు. చిట్వేలి మండలం కుమ్మరపల్లికి చెందిన గర్భిణి దివ్యభారతికి పురిటినొప్పులు రావడంతో గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి భర్త, బంధువులతో వెళ్లారు. అక్కడి నర్సులు దివ్యభారతిని పరిశీలించి కాన్పు కష్టం అవుతుందని చెప్పి 108 వాహనం ఎక్కించారు. వైద్యురాలు భార్గవి పరిశీలించి రాజంపేటకు తీసుకెళ్లమన్నారు. అక్కడి నుంచి 108 వాహనంలో రాజంపేటకు వస్తుండగా పట్టణ శివారులోకి రాగానే పురిటినొప్పులు అధికం కావడంతో వాహనంలోని ఈఎంటీ సుధాకర్, పైలెట్‌ నరసింహారెడ్డి కాన్పు చేయడానికి కృషిచేశారు. దివ్యభారతి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అదే వాహనంలో రాజంపేట సీమాంక్‌ కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బాధితురాలి భర్త టి.గంగాధర్‌ మాట్లాడుతూ.. కుమ్మరపల్లి నుంచి చిట్వేలి ఆసుపత్రికి వెళ్లగానే అక్కడి నర్సులు చూశారు. కాన్పు కష్టమన్నారు. అంతలోనే అక్కడికి వచ్చిన డాక్టర్‌ వాహనంలోనే నా భార్యను పరీక్షించారు. వెంటనే రాజంపేటకు తీసుకెళ్లాలని సూచించారు. ఇక్కడ కాన్పు చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని, రాజంపేటకు తీసుకెళితే అక్కడా కష్టమైతే కడపకైనా వెళ్లవచ్చిని సలహా ఇచ్చారు. ఆసుపత్రిలో కష్టమైన కాన్పు 108 వాహనంలో సురక్షితంగా చేశారు. వారివల్ల కానిది వీరెలా చేశారో వైద్యులకే తెలియాలని ఆయన పేర్కొన్నారు.

About The Author