విహార యాత్రలకూ బయలుదేరండి. గుండెకూ మేలు చేస్తాయి…..
ఎప్పుడూ పనులేనా? అప్పుడప్పుడు విహార యాత్రలకూ బయలుదేరండి. ఇవి ఒత్తిడి తగ్గటానికే కాదు.. గుండెకూ మేలు చేస్తాయి! తరచుగా విహార యాత్రలకు వెళ్లేవారిలో గుండెజబ్బుకు దారితీసే జీవక్రియల రుగ్మత (మెటబాలిక్ సిండ్రోమ్), లక్షణాలు తక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. రక్తపోటు.. రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు ఎక్కువగా ఉండటం వంటి అన్నింటినీ కలిపి జీవక్రియల రుగ్మతగా భావిస్తారు. ఇవి గుండెజబ్బు, పక్షవాతం, మధుమేహం ముప్పు పెరగటానికి దోహదం చేస్తాయి. ఈ ముప్పు కారకాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఆయా జబ్బులు వచ్చే అవకాశమూ ఎక్కువవుతుంది. మంచి విషయం ఏంటంటే- మన జీవనశైలితో ముడిపడిన వీటిని మార్చుకునే వీలుండటం. తరచుగా విహార యాత్రలు చేయటంతో ఇవి తగ్గుముఖం పడుతున్నట్టు తేలటం గమనార్హం. కాబట్టి వీలున్నప్పుడల్లా అలా విహార యాత్రలకు బయలుదేరితే అటు ఉల్లాసం, ఇటు ఆరోగ్యం.. రెండూ సొంతమవుతాయి.