పచ్చదనాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యం…


పచ్చదనాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని, నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దూలపల్లి లో ఆయుష్ వనం, కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ లో వాక్ ఇన్ ఏవియరీని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రూ.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాక్ ఇన్ ఏవియరీ ని మంత్రులు ప్రారంభించారు. కన్యూజ్ (conures), ఫేజన్స్ (pheasants), కాక్టెయిల్, మకావు పక్షులను ఏవియరీ లోకి వదిలారు. అనంతరం దూలపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా బహదూర్ పల్లి లో 25 హెక్టార్లలో విస్తర్ణంలో అభివృద్ధి చేసిన ఆయుష్ వనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… పట్టణీకరణ శరవేగంగా జరుగుతూ ఉందని, దీనివల్ల నగరాలు కాంక్రీట్ జంగిల్ గా మారుతున్నాయన్నారు. పట్టణీకరణతో వనాలు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచుతూ… అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భావితరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాలానే లక్ష్యంతో తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. నగర శివారుల్లో వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ భూములను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు HMDA, అటవీ శాఖ సంయుక్తంగా అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు. రణగణ ధ్వనుల మధ్య బిజీ జీవితం గడుపుతున్న నగర వాసులు మానసికోల్లాసం పొందేందుకు అర్బన్ పార్కులు ఉపయోగ పడతాయన్నారు. నగర శివారులో వారాంతాల్లో ప్రశాంతంగా గడిపేందుకు ఈ పార్కులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఆహ్లాదకరంగా, అందంగా తీర్చిదిద్దిన అటవీ శాఖ అధికారులను మంత్రి అభినందించారు.

*విరివిగా మొక్కలు నాటండి*

*5వ విడత హరితహారాన్ని విజయవంతం చేయండి*: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి*

విరివిగా మొక్కలు నాటి 5వ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయంవంతం చేయాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యానికి కళ్లెం వేసేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కాలుష్యం పెరగడం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి పర్యావరణానికి ముప్పువాటిల్లే ప్రమాదం కనిపిస్తుందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని కోరారు. హరితహార కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 113 కోట్ల మొక్కలు నాటామని, 5వ విడత హరితహార కార్యక్రమంలో 83 కోట్ల మొక్కలు నాటాలని నిర్ధేశించినట్లు చెప్పారు. పండ్లు, పూల మొక్కలతో పాటు అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉంచాం. ఈ ఏడాది రోజ్ వుడ్ .. శ్రీగంధం మొక్కలు ప్రత్యేకంగా పెంచాలని నిర్ణయించాం. 33శాతం అడవులు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

*మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి*

దూలపల్లి … కండ్లకోయ ప్రాంతాల్లో అటవీ భూముల్లో పార్క్ లను ఏర్పాటు చేస్తున్నాం. అటవీ భూములను పార్క్ లుగా చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నగర శివార్లలోని మరో నాలుగు అటవీ భూములు పార్కులుగా మార్చుకున్నామని, త్వరలోనే వాటిని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. నగరవాసులు సేదతీరేందుకు అర్బన్ పార్కులు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. పరీక్షల సమయంలో స్టడీ ప్లేస్ గా విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

*అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝా*

ఈ సంవత్సరం 83 కోట్ల మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీ ఉండాలి. ఇప్పటికే 12 వేల నర్సరీ లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 76 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి
ప్రతి ఇంటికి, ప్రతి ఇనిస్టిట్యూట్ లో మొక్కలు నాటాలి. కోతులకు కావాల్సిన పండ్ల మొక్కలను కూడా నాటుతున్నాం. అంతేకాదు రైతులకు శాండల్ వుడ్ ప్రత్యేకంగా నాటాలి అని భావిస్తున్నాం. రైతులకు ఉచితంగా ఈ శాండీల్ వుడ్ మొక్కలు అందిస్తాం. 25 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వెదురు మొక్కలు కూడా ఉచితంగా అందిస్తాం. రైతులకు, ఫారెస్ట్ కు చాలా ఉపయోగం. ప్రతి ఒక్కరు మొక్కలను నాటాడమే కాకుండా వాటిని సంరక్షించాలి.

*ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (HoFF) పీకే ఝా, ఎఫ్ డీసీ ఎండీ రఘువీర్, పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ మునీంద్ర, దొబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, హైదరాబాద్ సీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి, మేడ్చల్ డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About The Author