మట్టి లేకుండానే వ్యవసాయం!
మట్టితో పని లేకుండానే మధ్యప్రదేశ్ రత్లాంకు చెందిన యువరైతు అరవింద్ దాఖడ్ వ్యవసాయం చేస్తున్నారు. ‘హైడ్రోపోనిక్స్’ అనే సాంకేతికత సహాయంతో పాలీహౌస్ ఏర్పాటు చేసి ఇంట్లోనే కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ విధానంలో కేవలం ఖనిజాలు, నీటి సహాయంతోనే సాగు చేస్తారు. ఐదేళ్ల క్రితం స్ట్రాబెరీ పంటతో ఈ మట్టిరహిత సాగును ప్రారంభించిన అరవింద్ ప్రస్తుతం మిర్చి, టమాటా వంటి కూరగాయలనూ పండిస్తున్నారు.
ఈ సాంకేతికత.. ఇంట్లోనే పంటలు పండించాలనుకునేవారికి ఎంతో అనుకూలమని, ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని వారికి మంచి ప్రత్యామ్నాయమని అరవింద్ చెబుతున్నారు. ఇంట్లో, ఇంటిపైన, బాల్కనీలోనూ సాగు చేయవచ్చని, నీటి వినియోగం కూడా తక్కువేనని తెలిపారు. సాగుకు సరైన మోతాదులో సూర్యరశ్మి ఉంటే పండించడం చాలా సులభమని.. దీనికి ప్రత్యామ్నాయంగా ఎల్ఈడీ లైటింగ్ వాడకంపైనా పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపారు.