విత్తనాలు నేరుగా నాటుకోండి..!

ప్రధాన పొలాల్లో రైతుల్లా కాకుండా మిద్దెతోటలు, పెరటితోటల వారికి ఒక వెసులుబాటు ఉంది…
అది నేరుగా విత్తనాలు నాటుకోవడం. దీనివల్ల లాభాలేమిటో తెలియజేస్తున్నారు ప్రముఖ మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి.

ముందుగా మనం శ్రద్ధ పెట్టవలసిన
రెండు విషయాలు మాట్లాడుకుందాం..!

1) వర్షాకాలం కనుక మడులు లేదా బెడ్స్‌ లేదా కుండీలు ఏవైనా సరే వాటి డ్రెయినేజీ హోల్స్‌ మూసుకుపోయే అవకాశం ఉంటుంది. నీరు నిలవడం వల్ల మొక్కలు చనిపోతాయి. కనుక ఎప్పటికప్పుడు డ్రెయినేజీ హోల్స్‌ను చెక్‌ చేస్తూ ఉండాలి. మొక్కలకు నీరు పెట్టినప్పుడు కానీ, వర్షం కురిసినప్పుడు కానీ మడుల్లో నీరు నిలిచి ఉన్నదీ లేనిదీ గమనించాలి. జామ్‌ అయితే క్లియర్‌ చెయ్యాలి.

2) వాతావరణం చల్లగా ఉంటుంది కనుక చీడపీడల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మొక్కలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
ఈ వారం ఒక పాత పద్ధతి గురించి తెలుసుకుందాం. జూలై మొదటి వారం కూడా గడుస్తోంది. వర్షాలు అంతంత మాత్రమే ఉన్నాయి. చెరువుల్లో, దొరువుల్లో నీరు రాలేదు. భూగర్భజలాలు అడుగంటాయి. రైతులు విత్తుకున్న విత్తనాలు మొలుస్తున్నాయి. పొలాల్లో రైతుల తీరుగానే మిద్దెతోటలు, పెరటితోటల రైతుల పరిస్థితి కూడా ఉంది. నార్లను ప్రధాన మడుల్లో నాటుకుంటున్నారు. ఇంకా విత్తనాలు విత్తుకోని వారు, నార్లు పోసుకోని వారు ఇప్పటికైనా ప్రయత్నం చెయ్యవచ్చు. నార్లు పోయాల్సిన అవసరం లేకుండా నేరుగా విత్తనాలను విత్తుకోవాలి. కొన్ని రకాల విత్తనాలను టొమాటో, వంగ, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, మిర్చి వంటి వాటిని రైతులు నెల రోజులు ముందు చిన్న చిన్న బెడ్స్‌ మీద నార్లు పోసుకుంటారు. తరువాత వాటిని పెరికి ప్రధాన మడుల్లో నాటుకుంటారు. దీనివల్ల ప్రధాన పొలం మెయింటెనెన్స్‌ తప్పుతుంది. కలుపు, గట్రా సమస్యలు ఉండవు. నార్లు పోసిన తరువాత నాటుకునే పద్ధతిలో ఒక తీవ్ర అసౌకర్యం కూడా ఉంది. నారు మొక్కల్ని తిరిగి నాటడం వల్ల అవి షాక్‌కు గురవుతాయి. తిరిగి వేరూనుకునేదాకా మొక్కలు ఒకరకమైన సిక్‌నెస్‌కు లోనవుతాయి. వారం, పది రోజుల ఎదుగుదల ఆగుతుంది. మెయింటెనెన్స్‌ సరిగా లేకపోతే నాటిన లేత మొక్కలు చనిపోతాయి.

దాదాపుగా యాభై సంవత్సరాల క్రితం రైతులు నార్లు పోసేవారు కాదు. నేరుగా విత్తుకునేవారు. అందువల్ల మొక్కల పెరుగుదలలో ఆటంకం ఉండేది కాదు. అదే పద్ధతిని మనం ఇప్పుడు పాటించవచ్చు. ప్రధాన పొలం మనకు తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది కనుక మెయింటెనెన్స్‌ సమస్యలు అంతగా ఉండవు. కలుపు తీసుకోవడం కూడా పెద్ద సమస్య కాదు. అందుకని మిద్దెతోటలు, పెరటితోటల రైతులు ప్రత్యేకంగా కొన్ని రకాల విత్తనాలను నార్లు పోసుకోనవసరం లేదు. నేరుగా నాటుకోవచ్చు. సన్నని విత్తనాలను జాగ్రత్తగా మొక్కకూ మొక్కకూ మధ్య నిర్దేశిత దూరాలను ఉండేలా చూసుకుంటూ ప్రతీ పాదులో రెండు మూడు విత్తనాలను నాటుకోవాలి. ఒకటి మొలవకపోయినా మరోటి మొలుస్తుంది. మొలిచిన అదనపు మొక్కలను పెరికి, మొలవని చోట భర్తీ చెయ్యవచ్చు. నేరుగా విత్తనాలను విత్తుకోవడమే సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతి.

About The Author