మా అమ్మానాన్న కొట్టుకుంటుంటున్నారు .. నేను చచ్చిపోతాను – రాష్ట్రపతికి బాలుడి లేఖ ..
దంపతులు అన్యోన్యంగా ఉండడమే తమ పిల్లలకిచ్చే అతిపెద్ద సందేశం. కానీ, ఈ మధ్యకాలంలో పిల్లలు ముందు తల్లిదండ్రులు ఘర్షణపడే ఘటనలు పెరిగిపోతుండడం చూస్తూనే ఉన్నాం. ఇది పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. తాజాగా బిహార్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తమ తల్లిదండ్రులు తరచూ ఘర్షణ పడుతుండడం చూసిన ఓ బాలుడు తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఏం చేయాలో అర్థం కాక తనలో తానే కుమిలిపోయాడు.తనకు జీవితంపై విరక్తి కలిగిందని.. చనిపోవడానికి అనుమతించాలంటూ వేడుకొన్నాడు. తన సమస్యని దేశ ప్రథమ పౌరుడైతేనే తీర్చగలడు అనకున్నాడో ఏమో.. తన బాధను వివరిస్తూ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశాడు.
బిహార్‌కు చెందిన ఓ 15ఏళ్ల బాలుడు ప్రస్తుతం ఝార్ఖండ్‌లో నివాసముంటున్నారు. అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి పట్నాలోని ఓ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నారు. బాల్యం అంతా భగల్‌పూర్ సమీపంలోని ఎన్టీపీసీ కాలనీలో తన తాత వద్ద గడిచింది. తాత ఉద్యోగ విరమణ చేశాక.. దేవ్‌గర్‌లోని తన తండ్రి వద్దకు చేరుకొని అక్కడే విద్యనభ్యసిస్తున్నాడు. అయితే తరచూ గొడవపడే తన తల్లిదండ్రులు విడిపోయి ఎవరికి వారే జీవనం సాగిస్తున్నారు. ఇది అతణ్ని ఎంతో బాధించింది. తీవ్ర ఆవేదనకు గురైన ఆ బాలుడు ఏం చేయాలో అర్థం కాక రాష్ట్రపతికి లేఖ రాశాడు. తల్లిదండ్రుల గొడవలు చదువుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడుతున్నారని వివరించాడు. ఇదంతా చూసిన తనకు జీవితంపై విరక్తి కలిగిందని.. చనిపోవడానికి అనుమతించాలంటూ వేడుకొన్నాడు.
లేఖను అందుకొన్న రాష్ట్రపతి భవన్ వర్గాలు దాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో) పంపారు. దీంతో ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల భగల్‌పూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పీఎంవో ఆదేశించింది. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం బాలుడి వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన కారణంగా చట్టబద్దంగా సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని బాలుడికి భరోసా కల్పించారు.