పదెకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్న మహారాష్ట్ర మహిళా రైతు…
ఆ క్షేత్రం.. బృందావనం
అమెరికాలో మంచి ఆదాయం వచ్చే ఉద్యోగం వదిలేసి స్వస్థలం మహారాష్ట్రకు తరలి వచ్చారు గాయత్రి భాటియా. వారసత్వంగా వచ్చిన పదెకరాల పొలాన్ని అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దారు. పదేళ్లుగా ఆ క్షేత్రాన్ని బృందావనంగా తీర్చిదిద్ది, సహజ ఆహారం పండిస్తున్నారామె.
ప్లాస్టిక్, రసాయనాలు మన జీవితాల్లో అణువణువునా పరుచుకోవడం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముట్టడం ఎందుకు జరుగుతోందని ఆలోచించారు అమెరికా పర్యావరణ శాఖలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న గాయత్రి భాటియా. మనం తినే తిండి, పీల్చే గాలి అన్నీ రసాయనాల మయం కావడమే అందుకు కారణం అని గుర్తించారు. కృత్రిమమైన జీవన విధానానికి స్వస్తి చెబితేనే మానవాళి మనుగడ సాధ్యమని గ్రహించారు. ప్రకృతిని నాశనం చేస్తూ పర్యావరణ కన్సల్టెంట్‌గా ఉండటంలో అర్థంలేదనుకున్నారు. లక్షల ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశారు. మహారాష్ట్రలోని వాడాలో పదెకరాల వ్యవసాయ భూమి ఆమెకు వారసత్వంగా వచ్చింది. 2009లో ఆ భూమిలో ప్రకృతి సేద్యం ప్రారంభించారు. తన వ్యవసాయ క్షేత్రానికి బృందావనం అని పేరు పెట్టుకున్నారు.
ఈ రోజున ఆమె క్షేత్రంలో పండని పంట లేదు. చెర్రీ టమాటా, మామిడి, బొప్పాయి, అన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో పాటు సుమారు 100 రకాల పంటలు పండిస్తున్నారామె. ఈ వేసవిలో ప్రకృతి సిద్ధంగా పండించిన మామిడిని ముంబైలోని పేరున్న హోటళ్లకు విక్రయించారు గాయత్రి. 8 మంది కూలీలతో కలిసి ఆమె రోజంతా క్షేత్రంలో పనిచేస్తారు. ‘మనలో ప్రతి ఒక్కరం పర్యావరణానికి ఏదో రకంగా హాని చేస్తున్నాం. మన ఆలోచనలో సమూలమైన మార్పు రాకపోతే మానవాళికి భవిష్యత్తు లేదు. అందుకే పూర్తి ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తున్నాను. పదెకరాల క్షేత్రంలో కృత్రిమ ఎరువులు కానీ, రసాయనాలు కానీ ఉపయోగించడం లేద’న్నారు ఆ మహిళా రైతు. గో వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, ఎండిన ఆకులతో సహజమైన ఎరువులు సిద్ధం చేసుకుని ఉపయోగిస్తున్నారామె. పూర్వం మన రైతులు అనుసరించిన సహజ పద్ధతుల్ని మళ్లీ మనం అనుసరించాలి.
యంత్రాల సాయం లేకుండా పదెకరాల క్షేత్రం నిర్వహణ చూసుకో గలుగుతున్నాను. గ్రామీణ రైతులు ఇంకా సులువుగా సహజ పద్ధతుల్లో సాగు చేసుకోగలరంటారామె. ప్రకృతి సిద్ధంగా పంటలు పండించడంతో పాటు దేశీ విత్తన బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకున్నారామె. విత్తనాల కోసం రైతులు ఎక్కడో వెదకడం దురదృష్టకరం అంటారు గాయత్రి. ప్రారంభంలో నాణ్యమైన విత్తనాలు తీసుకువచ్చి పండించడం మొదలు పెట్టాను. ఆ తరువాత నుంచి నా పొలంలో పండిన పంట నుంచి తీసిన విత్తనాలను నిల్వచేసి అవసర మైనప్పుడు నాటుకుంటున్నాను. దీనివల్ల నాణ్యమైన పంట చేతికి వస్తున్నదన్నారామె. చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా తమ విత్తన నిధి నుంచి విత్తనాలు అందిస్తున్నట్లు ఆమె వివరించారు.
• ఆదాయానికి ఢోకా లేదు..!
సహజ పద్ధతుల్లో మేం పండించిన పంటలను ముంబైకి తరలిస్తున్నాం. సేంద్రియ ఆహార ప్రియులకు నేరుగా మా క్షేత్రంలో పండించిన పంటలను విక్రయిస్తున్నాం. కొన్ని ఆర్గానిక్ స్టోర్‌లు, హోటళ్లకు కూడా మా ఉత్పత్తులను అందిస్తున్నాం. ప్రకృతి సహజంగా పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి రాబడికి ఢోకా లేదు. రైతులు వారి పొలాల్లో కొంత భాగంలో అయినా సహజ పద్ధతుల్లో పంటలు పండించాలి. అప్పుడే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
‘అమెరికాలో ఉద్యోగం చేసే సమయంలో పొందిన ఆనందం కన్నా నా బృందావనంలో ప్రకృతి సిద్ధంగా పంటలు పండించి, పర్యావరణానికి మేలు చేస్తున్నాననే భావన వెయ్యి రెట్లు అధికంగా
ఆనందం ఇస్తుంద’న్నారు గాయత్రి భాటియా.