పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం… అందుకే మా కుక్క మాకొద్దు..


కొన్ని సంఘటనలు చూస్తే.. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాదు. అలాంటి సంఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క.. పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందనే నేపంతో దాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్లాడో వ్యక్తి. వివరాలు.. నగరంలోని ఓ రద్దీ మార్కెట్‌ బయట సుమారు మూడు సంవత్సరాల వయసున్న తెల్లని బుజ్జి పొమరేనియన్‌ జాతి కుక్క తచ్చాడటం జంతు ప్రేమికుల దృష్టికి వచ్చింది. ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న ఆ కుక్కను షామిన్‌ అనే జంతు ప్రేమికురాలు రక్షించి అక్కున చేర్చుకుంది. ఆ సమయంలో కుక్క మెడలో ఆమెకు ఓ ఉత్తరం కనిపించింది. అది చదివిన ఆమె ఒక్కసారిగా అవాక్కయ్యారు. మలయాళంలో రాసిన ఆ ఉత్తరంలో కుక్కను వదిలేయాడానికి గల కారణాలు రాశాడు దాని యజమాని.
ఇంతకు లేఖలో ఏం ఉన్నదంటే.. ‘ఇది చాలా మంచి జాతికి చెందిన కుక్క. అందరితో చక్కగా ప్రవర్తిస్తుంది. ఎక్కువ తిండి అవసరం లేదు. దీనికి ఎలాంటి జబ్బులు లేవు. ఐదురోజులకు ఒకసారి స్నానం చేపిస్తే సరిపోతుంది. ఈ మూడేళ్లలో ఇది ఒక్కరిని కూడా కరవలేదు. పాలు, బిస్కెట్లు, గుడ్లు ఆహారంగా ఇవ్వాలి. అప్పుడప్పుడు మొరగడం తప్పించి వేరే సమస్యలేం లేవు. ఇక ఇప్పుడు దీన్ని ఇలా వదిలేయడానికి ఓ కారణం ఉంది. ఇది పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అందుకే దీన్ని వదిలేస్తున్నాను’ అని ఉత్తరంలో పేర్కొన్నాడు. ఈ విషయం గురించి షామిన్‌ మాట్లాడుతూ.. ‘జబ్బు చేస్తేనో.. గాయాలు అయితేనో పెంపుడు జంతువులను వదిలేయడం చూశాం కానీ.. అక్రమ సంబంధం పెట్టుకుందని వదిలేయడం మాత్రం ఇదే మొదటిసారి. అక్రమ సంబంధం పెట్టుకుందని వదిలేయాడానికి అదేమైన మనిషా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షామిన్‌. ఇక నుంచి ఈ కుక్కను తానే పెంచుకుంటానని చెప్పారు.

About The Author