గుండె రక్తనాళంలో స్టెంట్‌ అమర్చినా.. సెక్స్ జీవితానికి ఇబ్బంది లేదు…


గుండె రక్తనాళంలో స్టెంట్‌ అమర్చినా సంసార జీవితానికి ఇబ్బందేమీ ఉండదు. స్టెంట్‌ అమర్చిన 20, 25 ఏళ్ల తర్వాత కూడా ఎంతోమంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తున్నారు. దీని గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదు. ప్రస్తుతం చిన్న వయసులోనే.. 30-40 ఏళ్లలోనూ ఎంతోమంది గుండెజబ్బుల బారినపడుతున్నారు. ఎంతోమందికి స్టెంట్లు అమరుస్తున్నారు. స్టెంటంటే మరేంటో కాదు. చిన్న గొట్టం. ఇది వల మాదిరిగా ఉంటుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో పూడిక ఉన్నవారికి యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా రక్తనాళాన్ని వెడల్పు చేసి అక్కడ స్టెంటు అమరుస్తారు. దీంతో గుండెకు రక్తసరఫరా మెరుగవుతుంది. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే అన్ని పనులూ చేసుకోవచ్చు. శృంగార జీవితమూ గడపొచ్చు. ముందు జాగ్రత్తగా డాక్టర్లు గుండె పంపింగ్‌ సామర్థ్యం ఎలా ఉందనేది పరీక్షిస్తారు. ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ల వంటివి చేస్తారు. గుండె వేగం 120-130కి చేరుకున్నా ఆయాసం, ఈసీజీలో మార్పుల వంటివేవీ లేకపోతే అన్ని పనులు చేసుకోవచ్చని సూచిస్తారు. కాకపోతే స్టెంటు తిరిగి పూడుకుపోకుండా మందులు వేసుకోవాల్సి ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలేవైనా ఉంటే అదుపులో ఉంచుకోవాలి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మున్ముందు అందరిలా హాయిగా గడపొచ్చు.

About The Author