సకల హంగుల ‘సంత’ ఆదర్శంగా సిద్దిపేట రైతు బజార్‌…


రైతులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ
తమ ఉత్పత్తులను కూరగాయల మార్కెట్లలో అమ్ముతుంటారు. వారికి అవసరం అయిన కనీస సదుపాయాలు అక్కడ కనిపించవు. మార్కెట్‌ ఆవరణంతా వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉంటుంది. దీనికి పరిష్కార మార్గంగా అత్యాధునిక మార్కెట్‌ను సిద్దిపేటలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు..

• ఎలక్ట్రానిక్‌ తెర.. గుర్తింపుకార్డులు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ రైతు బజారును నిర్వహిస్తున్నారు. ఇందులోకి అడుగుపెట్టగానే ఎలక్ట్రానిక్‌ తెరలో ధరలతో కూడిన పట్టిక దర్శనమిస్తుంది. రైతులందరూ ఈ ధరలకు అనుగుణంగా కూరగాయలను అమ్ముతుంటారు. కూరగాయలు అమ్మే రైతులందరికీ ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను అందజేశారు. రైతుబజారుకు రాగానే రైతులు అక్కడ ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక యంత్రం వద్దకు వెళ్లి తమ కార్డును స్కాన్‌ చేస్తారు. వీరికి ఓ అలాట్‌మెంట్‌ చీటీ వస్తుంది. అందులో వారి కౌంటర్‌ నెంబరు వస్తుంది. ఈ విధంగా రైతులకు క్రమపద్ధతిలో కౌంటర్‌లను కేటాయిస్తారు. అక్కడే కూరగాయలను అమ్ముకోవాల్సి ఉంటుంది. దాదాపుగా 3070 మంది రైతులు ఇక్కడ రిజిస్ట్రర్‌ చేసుకున్నారు. సీజన్‌ల వారీగా రైతులు కూరగాయలను విక్రయిస్తుంటారు. ఏ రోజుకు ఆరోజు కౌంటర్‌ల కేటాయింపు జరుగుతుంది. రైతు అమ్మకం పూర్తి కాగానే మరొకసారి కార్డును స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ కౌంటర్‌ ఇతరులను కేటాయించడానికి వీలవుతుంది.

* కార్డు పొందటం ఎలాగంటే..!

గుర్తింపు కార్డును రైతులకు ఉచితంగా అందిస్తారు. ఇందుకు రైతులు తమకు భూమి ఉందని స్థానిక మండల రెవెన్యూ అధికారి, కూరగాయలు పండిస్తారని ఉద్యానవన అధికారి సంతకాలు చేసిన పత్రాలను సమర్పించవలసి ఉంటుంది.

• ఉచితంగా తూకాలు.. వ్యర్థాలతో విద్యుత్తు

తూకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా, విక్రయదారులకు సౌలభ్యంగా ఉండేందుకు ఎలక్ట్రానిక్‌ తూకాలను అందిస్తున్నారు. దీనికి రైతులు ఎలాంటి డిపాజిట్‌ చెల్లించవలసిన అవసరం లేదు. రైతులు తమ కార్డును చూపించగానే రిజిస్టర్‌లో వారి పేరు నమోదు చేసుకుని తూకాలను ఇస్తారు. రైతులు ఆ రోజు అమ్ముకోగా మిగిలిన కూరగాయలు పాడైపోతాయి. దీనికి పరిష్కార మార్గంగా శీతల గిడ్డంగిని ఏర్పాటు చేశారు. రైతులు కూరగాయలను ఇక్కడ నిల్వ చేసుకోవచ్చు. రైతులు అమ్ముకోగా మిగిలిన, పాడైపోయిన కూరగాయలు, వ్యర్థాలను బయట పాడేయకుండా వీటి నుంచి విద్యుత్తును తయారు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా బయో విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రైతుబజారు నిర్వహణకు రోజుకు 200 యూనిట్ల విద్యుత్తు అవసరం అయితే దాదాపు 100 యూనిట్ల విద్యుత్తును దీని ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. నెలకు 30 నుంచి 40 వేల రూపాయలను ఆదా చేస్తున్నారు. రైతులు తాగడానికి మంచి నీటి కోసం ఆర్వోప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల సౌకర్యం, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతుబజారు మొత్తంలో ఓ గదిని ప్రత్యేకంగా దీని కోసం ఏర్పాటు చేశారు. మనకు అవసరం లేని వస్తువులు ఇతరులకు అందించవచ్చును. బట్టలు, పుస్తకాలు, ఇతర వస్తువులను ఇస్తుంటారు.

* నిర్వహణకూ ఓ ఆలోచన

పెద్ద మొత్తంలో రైతు బజారును నిర్వహిస్తున్నందున దీని నిర్వహణ భారం కూడా పెరుగుతుంది. ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా డబ్బులను సమకూర్చుకుంటున్నారు. రైతుబజారు ముందు భాగంలో 16 కమర్షియల్‌ షాపులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రతి నెలా రూ.2లక్షల ఆదాయం వస్తుంది. దీంతో బజారు నిర్వహణను చూసుకుంటున్నారు.

About The Author