తెలంగాణ అడవుల్లో 26 పులులు మాత్రమే…
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశంలోని మొత్తం పులుల సంఖ్యను విడుదల చేసింది. దేశంలో మొత్తం 2,967 పులులు ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రభుత్వ విడుదల చేసిన జాబితా ప్రకారం తెలంగాణ అడవుల్లో 26 పులులు ఉన్నట్లు తేలిందన్నారు తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్రంలో పులుల సంఖ్య పెరగడం ఆహ్వానించ దగ్గ పరిణామమని ఆయన అన్నారు.
గతంలో రాష్ట్రంలో మొత్తం 20 పులులు ఉన్నాయని, ఇప్పుడు ఆ సంఖ్య 26 కు చేరిందని ఆయన అన్నారు.వేట, అడవుల నరికివేత, ఆవాసాల విధ్వంసం, పర్యావరణ మార్పులు, మనిషి-పులుల మధ్య ఘర్షణ తదితర కారణాల వల్ల పులులు, ఇతర వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, వాటిని కాపాడుకోవడానికి మనమందరం మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న రెండు పులుల సంరక్షణ కేంద్రాలకు మంచి రేటింగ్ ను ఇచ్చిందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.