ఆయుర్వేదం నందు వ్యాధుల పేర్లు – వాటి లక్షణాలు .


* అండవాతము – అండవృద్ధి – Hydrocele .

వృషణములలో రెండుగాని ఒకటికాని వాపు కలిగి ఉండుట పోటు కలిగియుండుట . వాత ప్రకోపం చేత పొత్తికడుపులో చెడునీరు పుట్టి అది క్రమముగా వృషణాలలోకి దిగి పెరిగెడి రోగం .

* అంతర్వ్రుద్ధి – Hernia .

వాతమును ప్రకోపింపచేయు పదార్దాలు అధికంగా భుజించుట వలన , మలమూత్ర వేగమును నిరోధించుట వలన , అతి బరువు మోయుట వలన వాతం ఎక్కువ అయ్యి సన్నపేగులో ఒక భాగం సంకోచింపచేసి తన స్థానం నుండి క్రిందికి వెడలి గజ్జ యందు చేరి గ్రంథిగా రూపం పొంది వాపును కలిగించు రోగం

* అగ్నిమాంద్యం –

జఠరాగ్ని మందం అయ్యి ఆకలి లేకుండా ఉండుట .

* అతిమూత్రము –

శరీరంలో మేహం అధికం అయ్యి మూత్రం విస్తారంగా పొయ్యే రోగం .

* అతిసారం –

అమితముగా , వికృతముగా విరేచనములు అయ్యే రోగం .

* అనాహం –

మూత్రం బంధించబడి కడుపు ఉబ్బే రోగము .

* అపస్మారం – Hysteria .

స్మృతి లేక నోటి వెంట నురుగు పడటం మొదలగు చిహ్నాలు గల రోగం . మరియు స్త్రీలకు వచ్చెడి కాకిసోమాల అనే మూర్ఛరోగం .

* అభిఘాత జ్వరం –

కర్రలు , రాళ్లు మొదలగు వాటితో దెబ్బలు తగులుట చేత , మన శరీర సామర్ధ్యం కంటే అధికంగా పనిచేయుట వలన , అతిగా దూరం నడుచుట వలన వచ్చెడి జ్వరం .

* అశ్మరీ రోగం – Blader Stones .

మూత్రకోశము నందు రాళ్లు పుట్టుట వలన మూత్రము వెడలుట కష్టం అగు రోగము

* అస్థిగత జ్వరం –

శరీరం నందు ఎల్లప్పుడూ ఉంటూ దేహమును క్షీణింపజేయు జ్వరం.

* అస్రుగ్ధము – లeucorrhoea .

కుసుమరోగము అని కూడా అంటారు . యోని వెంట తెల్లగానైనా , ఎర్రగానైనా , పచ్చగానైనా , నల్లగానైనా జిగటగా నీరు స్రవించెడి రోగము .

* ఆమము –

భుజించెడి పదార్దాలు జీర్ణముగాని కారణంబున గర్భమున జిగురు కలిగి తెల్లగా , బిళ్లలుగా ఘనీభవించెడి దుష్ట జలము.

* ఆమాతిసారము – Dysentery .

ఆమమే విరేచనమయ్యే రోగము . దీనినే జిగట విరేచనాలు అని , ఆమ విరేచనాలు అని అంటారు.

* ఆర్శరోగము – PIలES .

మూలవ్యాధి అని అంటారు. గుద స్థానం న లోపల కాని , వెలుపల గాని మాంసపు మొలకలు జనియించి రక్తము స్రవించుచు గాని స్రవించక గాని నొప్పిని కలిగించు రోగము .

* ఆహిక జ్వరం – Intermittent fever .

దినము విడిచి దినము లేక మూడు దినములకు ఒకసారి కాని అప్పుడప్పుడు కనిపించే జ్వరం .

* ఉదర రోగము – Ascites .

శరీరం కృశించుట , తెల్లబారుట , కడుపులో దుష్టపు నీరు చేరి ఉదరము పెరుగుట మొదలగు చిహ్నములు గల రోగము

* ఊపిరిగొట్టు నొప్పి –

గాలి విడిచినప్పుడు గుండెలలో ఒకపక్క పోటు పొడిచినట్టు లేచేడి నొప్పి .

* ఎరుగు వాతము –

కాళ్ళు , చేతులు మొదలగు అవయవములు గాని దేహము అంతయు గాని ఎగురుచుండెడి ఒక విధమైన వాత రోగము .

* కరపాణి కురుపులు –

బిడ్డల యెక్క కాళ్ళమీద , చేతుల మీద దట్టముగా అయ్యేడి కురుపులు .

* కామిల రోగము – కామెర్లు – Jaundice .

కండ్లు , శరీరం , ఆకుపచ్చ లేక పసుపుపచ్చ వర్ణము కలిగి ఆకలి లేకుండా ఉండుట , దాహము , నీరసము మొదలగు లక్షణాలు కలిగి ఉండే రోగము .

* కార్శ రోగము – Emaciation

దేహము నందు ఉండేడి రక్తమాంసములు క్రమక్రమముగా క్షీణించుచూ వుండేడి ఒక రోగము దీనిని ఎండురోగం అని అంటారు.

* క్రిమి రోగము – Intestinal woms .

గర్భమున క్రిములు జనించెడి రోగము .

* గండమాల – Goitre or Scrofuja .

మెడ , మెడ వెనక నరము , మెడ పక్కలనుండి గ్రంధులుగా మొదలు అయ్యి క్రమముగా పక్వము అయ్యి చీము , రసి స్రవించెడి వ్రణములు అనగా గడ్డలు .

* గళ గ్రహము –

స్వరహీనంబై ఆహారాది పదార్ధాలను సులభముగా కంఠం దిగనివ్వకుండా ఉండేడి ఒక శ్లేష్మ రోగము .

* గాయపు సంధి – Tetanus .

కాలి బ్రొటనవేలుకు గాని , చేతి బ్రొటనవేలుకు గాని గాయము తగిలినప్పుడు ,శస్త్ర చికిత్సల యందు దుష్ట క్రిమి ప్రవేశించుట చేత మెడ కొంకులు కుంచించుకు పోయే రోగము .

* గాలి బిళ్లలు – Mumps .

చెవులకు క్రిందుగా వాపు , పోటుతో లేచేడి బిళ్లలు .

* గురదాలు – Kidneys .

వీటిని ఉలవకాయలు అందురు. ఇవి నడుముకి సమముగా లొపల వెన్నునంటి ఉండేడు మాంస గ్రంధులు. వీనివలన మూత్రము జనించును.

* గుల్మము – internel Tumors .

వాత , పిత్త , శ్లేష్మముల దుష్ట స్థితి వలన గర్భము న జనించెడి ద్రవకూటమి .

* గ్రహణి – Dysentry .

కడుపునొప్పి , ఆసనము తీపు కలిగి చీము లేక చీము రక్తము మిశ్రమమై విరేచనములు అయ్యేడి ఒకరకం అయిన అతిసార రోగము .

* చర్ది రోగము – trendency to vomit .

వమన రోగము అని అంటారు. వాంతులు ఎక్కువుగా అవుతాయి .

* చర్మ రోగము –

గజ్జి , చిడుము , పొక్కులు , తామర మొదలగు రోగములు .

* చిట్ల ఫిరంగి – a severe kind of syphilis .

దేహమున నల్లగా స్ఫోటకపు పొక్కుల వలే బయలుదేరేడి సవాయి రోగము .

* జలోదరము – Abdomanal dropsy or Ascitis .

గర్భమున అమితముగా విషపు నీరు పెరిగి పొట్ట నిండు కుండలా ఉండేడి రోగము .

* జిహ్వదోషము – Tongue diesease .

నాలుక ద్రవహీనం అయ్యి ముండ్ల వలే గరుకు కలిగి యే వస్తువు రుచింపకుండా ఉండుట .

* త్రయాహికా జ్వరం – Tertain fever .

మూడు దినములకు ఒకసారి వచ్చెడి చలి జ్వరం .

* నాడి వ్రణము – Guinea worm .

నారీ కురుపులు అనికూడా అంటారు.వీని నుండి తెల్లని దారము వలే నారి బయటకి వెళ్ళును.

* పరిణామ శూల –

ఆహారం జీర్ణం అయ్యే సమయంలో జనించెడి నొప్పి .

* పలల మేహము –

చిన్న చిన్న మాంసపు ముక్కలు మూత్రం వెంట పడే రోగము .

* పక్షవాతము – పరాలైసిస్ .

శరీరం యొక్క బాగం అనగా ఒకవైపు చెయ్యి , కాలు వీనికి వ్యాపించిన నరములకు సత్తువ లేకుండా చేయు రోగము .

* పాండురోగము – Anemia .

దేహము న రక్తము క్షయించి తెల్లబారి ముఖము , కనురెప్పలు , పాదములు , గుహ్యస్థలము నందు వాపు కలిగి ఉండేడి రోగము .

* పీఠికా మేహము – one type of syphilis .

దేహము అంతా మట్టిపొక్కులుగా లేచేడి మేహరోగము .

* పీనస – Ozoena .

ముక్కువెంట దుర్గంధముతో చీము , రక్తము వెడలె ఒక రోగము .

* ప్లీహారోగము – Enlargement of Spleen .

కడుపులో బల్ల పెరిగి కలిగెడు రోగము.

* పుట్ట వ్రణము – Cancer .

సెలలు వేసే మానని మొండి వ్రణము .

* పురాణ జ్వరం – Chronic Fever .

చాలాకాలం నుంచి ఉండేడి జ్వరం .

* బాలపాప చిన్నెలు – Convulsion of Children .

శిశువులకు 12 సంవత్సరాల లోపున అకస్మాత్తుగా మూర్చవలె కనిపించే రోగము .

* భగందరము – Fistula .

వృషణాలు కు దిగువున , గుదస్థానముకి పైన చిన్న కురుపువలె లేచి అది పగిలి అందులో నుంచి రసి , చీము కారెడి రోగము .

* మూత్రశ్మరీ –

మూత్రపు సంచిలో రాళ్లు పుట్టెడు రోగం .

* మూత్రఘాతం –

మూత్రం బంధించుట . మలమూత్ర , శుక్లములు పొత్తికడుపులో చేరి వికృతిని పొంది ముత్ర నిరోధము కలిగి అందువలన మూత్రం అతికష్టముగా బయటకు వెడలు మేహ రోగము .

* మూత్రకృచ్చం –

మూత్రము బొట్టుబొట్టుగా నొప్పితో వచ్చు రోగము . ఈ రొగికి శుక్లము మూత్రముతో బయటకి వచ్చును.

* మేఘరంజి –

నీటితో కూడిన మేఘము ఆకాశమున కప్పి ఉన్నప్పుడు శ్వాస పీల్చడం కష్టముతో కూడుకుని ఉండు ఒకరకమైన ఉబ్బస రోగము .

* క్షయ రోగము –

ఈ రోగమును ముఖ్యముగా కాస , శ్వాస , కఫము , జ్వరం , దేహము శుష్కించుట , నీరసం , ఏది తిన్నా రుచి లేకుండా ఉండటం , ఆకలి లేకపోవడం ఈ రోగ లక్షణాలు .

* రక్తపైత్యం –

ముక్కువెంట గాని , నోటివెంట గాని అకస్మాత్తుగా రక్తం ప్రవహించెడి రోగము .

* రక్తవాతం –

దీనిని వాత రక్తం అని అంటారు. రక్తం సహజముగా ప్రవహించక దేహమున ఏ భాగం నందు అయినా కూడి వాపు , ఎరుపు , పోటు కలిగి ఉండటం మొదలగు బాధలు కలిగి ఉండు ఒక రోగము .

* రుద్రవాతము –

హఠాత్తుగా మూర్చరోగము వలే స్మారకం లేక పడిపోవడం . నోటివెంట నురుగులు వెడలుట , అంగవైకల్యం కలుగుట ఇలాంటి లక్షణాలు కలిగిన రోగము

* లూతము –

కంటి కోన వద్ద పుట్టెడు రోగము .

* వలీఫలితము –

బాల్యము నందే శరీరం ముడతలు పడుట , వెంట్రుకలు నెరియు వ్యాధి .

* విద్రది –

గర్భము నందు పుట్టి నాభిలోకి వెడలు వ్రణము .

* విషజ్వరము –

ఒకప్పుడు ఉష్ణం అధికంగా ఉండి మరియొకప్పుడు ఉష్ణము లేకుండా ఒక సమయం లేకుండా వచ్చు జ్వరం.

* విసర్పి – Herpes .

ఎర్రగా కాని తెల్లగా కాని పొక్కులు ఒకచోట గుంపుగా లేచి వ్యథతో గూడిన చర్మరోగము . దీనినే సర్పి అందురు.

* శిల్ప కుష్ఠు –

రాళ్లు వలే గరుకుగా గ్రంధులు లేచేడు కుష్ఠు రోగము .

* శూల – Sposmodic colic .

కడుపులోగాని , పక్కలోగాని హటాత్తుగా వచ్చే కఠినమైన నొప్పి.

* శ్వేత కుష్ఠు – లeucoderma .

తెల్లని మచ్చలు బయలుదేరి వ్యాపించెడి కుష్ఠు రోగము .

* స్వరభంగ రోగము –

స్వరము క్షీణించి పోయెడి రోగము లేక గొంతు బొంగురుగా మారి స్వరం పలకని రోగము .

* నఖ బేధము –

చేతిగోళ్ళు , కాలి గోళ్లు నెర్రలు వచ్చుట .

* పాదశూల –

పాదముల యందు గాని , పాదముల పైభాగము నందు గాని విపరీతమైన నొప్పి లేక పోటు .

* గృధ్రసీవాతం – sayatika

పిరుదల యందు ప్రారంభం అయ్యి క్రమముగా వీపు , తొడలు , మోకాళ్లు , పిక్కలు , పాదములు వీటన్నింటి యందు భరించలేనంత బాధ మరియు తిమ్మిరి కలిగించు సమస్య.

* ఉరుస్తంభము –

తొడలు బిగుసుకొనిపొయి ఏ మాత్రం కదిలించలేని సమస్య.

* ఊరుపాదము –

తొడలు చచ్చుబడి సన్నగా అవ్వటం.

* గుదభ్రంశము – prolopse of rectum .

మలమార్గమగు గుదము కిందికి జారుట.

* వృషణోక్షేపము –

వృషణాలు తమ స్థానం నుంచి పైకి పీక్కొని పోవుట . ఇటువంటి పరిస్థితి అత్యంత తీవ్ర జ్వరంలో సంభవించును .

* ఖంజత్వం –

కుడి కాలు లేదా ఎడమకాలో ఏదో ఒకటి పనిచేయకుండా పోవుట .

* కుబ్జత్వం –

దీనిని గూని అని పిలుస్తారు . పృష్ఠభాగము నందలి స్నాయువులు సంకోచముచే శరీరావయములు ముడుచుకు పోయి వంకర అగుట.

* హృదయ శైధిల్యము –

హృదయము నందలి మాంస పొరలు ( Heart muscle fibers ) శైథిల్యం చెందుటచేత అనగా పట్టు తప్పుటచేత దడ (palpitation ) వచ్చును. ఇది శరీరంలో ఓజస్సు క్షీణించడం వలన సంభంవించును. హృదయం పెరుగుట కూడా జరుగును.

* వక్షోద్ధర్షము –

హృదయము యొక్క స్పందన అధికం అవ్వడం వలన వక్షస్థలం (chest ) అంతయు అదిరినట్లు లేక వణుకుడు అగుట.

* గ్రీవస్థంభము –

మెడ భాగము నందు వాతం అధికం అయ్యి మెడ పట్టుకొనిపోవుట .

* అపభాహకము –

పై చేతులు (upper arms ) ఎండిపొయినట్లు అయ్యి సన్నబడటం .

* అక్షితోదము –

నేత్రముల యందు సూదితో పొడిచినట్లు విపరీతమైన బాధ .

* వర్త్మ స్తంభము –

కనురెప్పలు మూసుకుని పోకుండా తెరుచుకొని ఉండటం.

* అర్ధితము –

ముఖములో సగభాగం చచ్చుబడిపోవుట దీనిని ఆంగ్లము నందు Facial Paralysis అని అంటారు.

* గ్లాని – Fatigue or Asthenia .

శరీర అవయవములు అన్నియు క్రియారహితములు అయ్యి వడలినట్లు ఉండటం.

* కేశభూమిస్పటనము –

తల మీది చర్మం బీటలుగా మారుట .

* ఆక్షేపకము –

శరీరము నందలి అవయవాలు విసిరినట్లు లేదా కొట్టుకొనినట్లు అగుట.

* దండకం –

శరీరం ఎటూ కదలకుండా కఱ్ఱవలె బిగుసుకొనిపోవడం .

* శ్వావారుణావ భాసత్వము –

చర్మము , పెదవులు , వ్రేళ్లు మొదలగునవి నలుపు , ఎరుపు వర్ణములలోకి మారుట .

పైన చెప్పినవే కాకుండగా మరెన్నో రోగములు మనుష్యునకు జనియించును. స్థలాభావం వలన కొన్నింటి గురించి మాత్రమే మీకు వివరిస్తున్నాను .

చివరగా ఒక్క మాట మనుష్య శరీరమే రోగాల పుట్ట . మనకి భగవంతుడు ఇచ్చిన ఈ కొద్ది సమయములోనే ఎన్నో దుష్టకార్యాలు చేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకొవడం జరుగుతుంది. మనకి ఉన్న కొంచం సమయాన్ని అయిన మనచేత సత్కార్యాలు చేయించవలసిందిగా ఆ పరమేశ్వరుడిని ప్రార్ధించుదాం . ఇది కేవలం నాయొక్క అభిప్రాయం మాత్రమే …

పైన చెప్పినవాటిలో కొన్ని సమస్యలుకు చికిత్సలు నా గ్రంథాలలో వివరించాను .

గమనిక –

నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల – 350 రూపాయలు .

ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల – 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని

ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్

9885030034

About The Author