18 ఏళ్లలో తొలిసారి సెలవు తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీ గారు..


సాహసయాత్రకు వెళ్లడాన్ని సెలవు (వెకేషన్‌)గానే భావిస్తే.. 18 ఏళ్లలో తొలిసారి తాను ఈ సెలవు తీసుకున్నట్లేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు.

చూస్తేనే ఒళ్లు జలదరించే 250 రాయల్‌ బెంగాల్‌ పులులు సంచరించే ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ అభయారణ్యంలో బేర్‌గ్రిల్స్‌ అనే సాహసికుడితో కలిసి ఆయన చేసిన యాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా నిలిచింది.

తన జీవితయాత్రను ఆ సాహసయాత్రతో సమ్మిళితం చేసిన మోదీ.. యువతలో ప్రకృతిపట్ల ప్రేమ, సహజవనరుల సంరక్షణ బాధ్యత పెంపొందించే ప్రయత్నం చేశారు.

ఈ కార్యక్రమం ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ పేరుతో సోమవారం రాత్రి 9 నుంచి 10వరకు డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమైంది. యాత్రలో భాగంగా ఇప్పటివరకు ఎవరూ వెళ్లని మార్గాన్ని ఎంచుకుని 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. ప్రధాని తన ప్రతి మాటనూ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే ఉపయోగించారు.

‘‘భారతదేశవ్యాప్తంగా 100 భాషలు, 1600 మాండలికాలున్నాయి. ఇంత వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు’’ అని బేర్‌గ్రిల్స్‌తో ప్రధాని మోదీ అన్నారు. తర్వాత ఇద్దరూ పులులున్న చోటుకు చేరుకున్నారు.

ఇలాంటిచోట నిరాయుధులుగా వెళ్లడం క్షేమం కాదన్న బేర్‌గ్రిల్స్‌కు మోదీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘‘ప్రకృతి ఎప్పుడూ ప్రమాదకరం కాదు. ప్రకృతితో సంఘర్షణ ప్రమాదకరమే. కలిసి జీవిస్తే ప్రకృతి మనకు సాయంచేస్తుంది’’ అని చెప్పారు.

ఈ సందర్భంగా బేర్‌గ్రిల్స్‌ ప్రధాని బాల్యం సాగిన తీరును తెలుసుకొనే ప్రయత్నం చేశారు. చిన్నతనంలో రైల్వేప్లాట్‌ఫారాలపై టీ అమ్మిన సంఘటనలను మోదీ నెమరేసుకున్నారు. నిరాయుధులుగా ఉండకూడదని బేర్‌గ్రిల్స్‌ తనతో తెచ్చిన ఓ కత్తిని కర్రకు కట్టి మోదీ చేతికిచ్చారు. మీరు ముఖ్యమైన వ్యక్తి కాబట్టి మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. మోదీ మాత్రం పైవాడిపై నమ్మకం పెట్టుకుంటే ఎవరికీ ఏమీకాదని వేదాంతధోరణిలో వ్యాఖ్యానించారు.
ముందే ఎండుగడ్డి, ఎండుకర్రలు, ప్లాస్టిక్‌ కవర్‌తో తయారుచేసి పెట్టిన తెప్పమీదుగా నదీప్రయాణం మొదలుపెట్టారు.

తాను చిన్నప్పుడు నదుల్లో సాన్నం చేసేవాడినని, తమకు అంతకుమించిన వసతులు ఉండేవికావని మోదీ గుర్తుచేసుకున్నారు. చెరువులో స్నానం చేస్తున్నప్పుడు మొసలిపిల్ల దొరికితే ఇంటికి తీసుకెళ్లానని, దాన్నిచూసి అమ్మ హింసించడం మంచిదికాదని చెప్పి తిరిగి నీళ్లలోనే వదిలిపెట్టమనడంతో చెరువులోనే వదిలానని మోదీ చెప్పారు.

‘‘చిన్నప్పుడు మా ఊళ్లో వర్షంపడితే మా నాన్న బంధువులందరికీ ఉత్తరాలు రాసేవారు. 20-30 కార్డులు తెచ్చి వర్షం పడిన ఆనందాన్ని పంచుకొనేవారు. నాన్న అప్పుడలా ఎందుకు చెప్పేవారో ఇప్పుడు అర్థమైంది. ప్రకృతివనరులకున్న ప్రాధాన్యం ఇప్పుడు తెలిసి వచ్చింది. మా నాన్నమ్మకు చదువురాదు. అయినా మా చిన్నాన్న కట్టెలవ్యాపారం చేస్తానంటే వారించింది. అందుకే మా జీవితంలో పర్యావరణం సహజస్వభావంగా మారింది’’ అన్నారు. ‘‘మనం ఇప్పుడు ఏదైనా ప్రకృతినుంచి తీసుకుంటే… 50 ఏళ్ల తర్వాత పుట్టే పిల్లలు ప్రశ్నిస్తారు. వారికి మనమేం సమాధానం చెబుతాం? ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ మసలుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. గంటపాటు సాగిన ప్రయాణంలో తనకు అద్భుతమైన ప్రకృతిని చూపినందుకు బేర్‌గ్రిల్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. బేర్‌గ్రిల్స్‌ కూడా మోదీతో కలిసి ప్రయాణం చేయడాన్ని తనకు లభించిన గొప్ప అవకాశంగా పేర్కొన్నారు.

About The Author