భగవద్గీత మహత్యం

గీతామహత్యం

1.భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణీ,

ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో

భూదేవి విష్ణు భగవానుని గూర్చి యిట్లు ప్రశ్నించెను. ఓ  భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

2.ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత స్సదా

స ముక్తస్స సుఖీ లోకే కర్నణా నోపలిప్యతే.

శ్రీ విష్ణువు చెప్పెను – ఓ భూదేవీ! ప్రారబ్ధ మనుభవించుచున్నను, ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై యుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంటబడక ఈ ప్రపంచమున సుఖముగ నుండును.

3.మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతిచేత్,

క్వచిత్స్పర్శం న కుర్వంతి నలినీదల మంభసా.

తామరాకును నీరంటనట్లు గీతాధ్యానముచేయు వానిని మహాపాపములుకూడ కొంచెమైనను అంటకుండును.

4.గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే,

తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై.

ఎచట గీతాగ్రంథముండునో, మరియు ఎచట గీత పారాయణ మొనర్చబడుచుండునో, అచట ప్రయాగ మొదలగు సమస్తతీర్థములున్ను ఉండును.

5.సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే,

గోపాలా గోపికావాపి నారదోద్ధవ పార్షదైః

సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే.

ఎచట గీతాపారాయణము జరుగుచుండునో, అచ్చోటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, భగవత్పార్శ్వర్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగ సహాయమొనర్తురు.

6.యత్ర గీతావిచారశ్చ  పఠనం పాఠనం శ్రుతమ్,

తత్రాహం నిశ్చితం పృథ్వి  నివసామి సదైవ హి.

ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చిన విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండునో, అచట నేనెల్లప్పుడును తప్పక నివసించుదును.

7.గీతాశ్రయోహం తిష్ఠామి  గీతా మే చోత్తమం గృహమ్,

గీతా జ్ఞాన ముపాశ్రిత్య త్రీన్లోకాంపాలయామ్యహవ్’.

నేను గీతనాశ్రయించుకొని యున్నాను. గీతయే నాకుత్తమమగు నివాస మందిరము. మరియు గీతా జ్ఞానము నాశ్రయించియే మూడు లోకములను నేను పాలించుచున్నాను.

8.గీతా మే పరమా విద్యా  బ్రహ్మరూపా న సంశయః,

అర్ధమాత్రాక్షరా నిత్యా  స్వనిర్వాచ్య పదాత్మికా.

గీత నాయొక్క పరమవిద్య. అది బ్రహ్మస్వరూపము. ఇట సంశయ మేమియును లేదు. మరియు నయ్యది (ప్రణవముయొక్క నాల్గవ పాదమగు) అర్థమాత్రాస్వరూపము. అది నాశరహితమైనది. నిత్యమైనది. అనిర్వచనీయమైనది.

9.చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునమ్,

వేదత్రయీ పరానంధా తత్త్వార్థజ్ఞానమంజసా

సచ్చిదానందస్వరూపుడగు శ్రీకృష్ణపరమాత్మచే ఈ గీత

స్వయముగ అర్జునునకు చెప్పబడినది. ఇది మూడు వేదముల సారము. పరమానంద స్వరూపము. తన్మాశ్రయించినవారికిది శీఘ్రముగ తత్త్వజ్ఞానమును కలుగజేయును.

10.యోష్టాదశ జపేన్నిత్యం   నరో నిశ్చలమానసః,

జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్.

ఏ నరుడు నిశ్చలచిత్తుడై గీత పదు నెనిమిది అధ్యాయములను నిత్యము పారాయణము సలుపుచుండునో, అతడు జ్ఞానసిద్ధినిబొంది తద్ద్వారా పరమాత్మపదమును (మోక్షమును) బడయగల్గును.

11.పాఠేసమర్థస్సంపూర్ణే   తదర్ధం పాఠ మాచరేత్,

తదా గోదానజం పుణ్యం   లభతే నాత్ర సంశయః

గీతను మొత్తము చదువలేనివారు అందలి సగము భాగమైనను పఠించవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఇవ్విషయమున సందేహములేదు.

12.త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్,

షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్.

గీత యొక్క మూడవ భాగము(1/3) (ఆఱు అధ్యాయములు) పారాయణ మొనర్చువారికి గంగాస్నానము వలన కలుగు ఫలము చేకూరును. ఆఱవ భాగము (1/6)(మూడధ్యాయములు) పఠించువారికి సోమయాగఫలము లభించును .

13.ఏకాధ్యాయం తు యోనిత్యం పఠతే భక్తి సంయుతః,

రుద్రలోక మవాప్నోతి  గణోభూత్వా వసేచ్చిరమ్

ఎవడు గీతయందలి ఒక్క అధ్యాయమును భక్తితో గూడి నిత్యము పఠించుచుండునో, అతడు రుద్ర లోకమునుపొంది అచ్చట రుద్రగణములలో నొకడై చిరకాలము వసించును.

14.అధ్యాయ శ్లోకపాదం వా   నిత్యం యః పఠతే నరః,

స యాతి నరతాం యావ న్మనుకాలం వసుంధరే.

ఓ భూదేవీ! ఎవడు ఒక అధ్యాయమందలి నాల్గవ భాగమును నిత్యము పారాయణము చేయునో, అతడు ఒక మన్వంతర కాలము (ఉత్కృష్టమగు) మానవ జన్మను బొందును.

15.గీతాయాః శ్లోక దశకం సప్త పంచ చతుష్టయమ్,

ద్వౌత్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః.

16.చంద్రలోక మవాప్నోతి   వర్షాణా మయుతం ధ్రువమ్,

గీతాపాఠసమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్.

గీతయందలి పది స్లోకములుకాని, లేక ఏడుకాని, ఐదుకాని, నాలుగుకాని, మూడుకాని, రెండుకాని, ఒకటికాని లేక కనీసము అర్ధశ్లోకమును గాని ఎవడు పఠించునో అతడు చంద్రలోకమునుబొంది అచట పదివేల సంవత్సరములు సుఖముగనుండును. ఇందు సంశయము లేదు. మరియు గీతను పఠించుచు ఎవడు మరణించునో, అతడు ఉత్తమమగు మానవజన్మమును బడయగల్గును.

17.గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తి ముత్తమామ్,

గీతేత్యుచ్చారసంయుక్  మ్రియమాణో గతిం లభేత్.

అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించుచు ఉత్తమమగు మోక్షముపొందును. ‘గీతా – గీతా’ అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని బడయును.

18.గీతార్థ శ్రవణాసక్తో  మహాపాపయుతోపి వా,

వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే.

మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుటయందాసక్తి కలవాడైనచో వైకుంఠమును బొంది అచట విష్ణువుతో సహా ఆనంద మనుభవించుచుండును.

19.గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః,

జీవన్ముక్తస్స విజ్ఞేయో  దేహాంతే పరమం పదమ్.

ఎవడు గీతార్థమును చింతన చేయుచుండునో, అతడు అనేక కర్మల నాచరించినను, జీవన్ముక్తుడేయని చెప్పబడును. మరియు దేహపతనాంతర మతడు పరమాత్మపదమును (విదేహకైవల్యమును) బొందెను.

20.గీతామాశ్రిత్య బహవో  భూభుజో జనకాదయః,

నిర్ధూతకల్మషా లోకే గీతాయాతాః పరమం పదమ్.

ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులగు రాజులనేకులు పాపరహితులై పరమాత్మపదమును బొందగలిగిరి.

21.గీతాయాః పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్,

వృథా పాఠో భవేత్తస్య  శ్రమ ఏవ హ్యుదాహృతః.

గీతను పఠించి ఆ పిదప మాహాత్మ్యము నెవడు పఠింపకుండునో, అతని పారాయణము (తగిన ఫల మునివ్వక) వ్యర్థమే యగును. కావున అట్టివాని గీతాపఠనము శ్రమమాత్రమే యని చెప్పబడినది.

22.ఏతన్మాహాత్మ్యసంయుక్తం  గీతాభ్యాసం కరోతి యః,

స తత్ఫల మవాప్నోతి  దుర్లభాం గతిమాప్నుయాత్.

ఈ మాహాత్మ్యముతో బాటు గీతాపారాయణము చేయువాడు పైన తెలుపబడిన ఫలమును బొంది దుర్లభమగు సద్గతిని (మోక్షమును) బడయగలడు.

23.మాహాత్మ్య మేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం,

గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేతే

సూతుడు చెప్పెను. ఓ శౌనకాదిమహర్షులారా! ఈ ప్రకారముగ సనాతనమైనట్టి గీతామాహాత్మ్యమును నేను మీకు తెలిపితిని. ఇద్దానిని గీతాపారాయణానంతర మెవడు పఠించునో అతడు పైన దెల్పిన ఫలమును బొందును.

ఇతి శ్రీవరాహపురాణే శ్రీ గీతామాహాత్మ్యం సంపూర్ణమ్.

About The Author