ఆ ఊళ్లో ఎన్ని నెమళ్లో..!

ఆ ఊళ్లలోని రోడ్లూ పొలాలూ పెరటితోటలూ ఇంటి పైకప్పులూ… ఎక్కడ చూసినా నెమళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తాయి. ఆకలేస్తే అడిగి మరీ తినిపించుకుంటాయి. గ్రామీణులే కాదు, వాళ్లు పెంచుకునే పశువులూ కోళ్లూ అన్నీ వాటికి స్నేహితులే.

నెమళ్లు అలా హాయిగా తిరిగే
ఆ ఊళ్లేంటో ఆ కథేంటో తెలుసుకోవాలంటే…!!!

బీహార్‌లోని సహరసా జిల్లాలోని ఆరణ్‌ గ్రామంలోకి అడుగుపెడితే- కొన్ని ఆడామగా నెమళ్లు చెట్ల కొమ్మలమీద కునుకుతీస్తుంటాయి. మరికొన్ని అప్పుడే నాటిన గోధుమ పంటచేలల్లో మేతకోసం వెతుక్కుంటూ ఉంటాయి. ఇంకొన్ని పెరట్లో విహరిస్తూ పశువులతో ముచ్చట్లాడుతుంటాయి. అందుకే అచ్చంగా వాటిని చూడ్డం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రీ అటవీ అధికారులూ ఆ ఊరిని సందర్శించారట. వెదురుపొదలూ చెట్లతో నిండిన ఆ వాతావరణం నెమళ్ల నివాసానికీ సంతానోత్పత్తికీ బాగుందని ఆనందాన్ని వ్యక్తం చేశారట.

సుమారు ముప్ఫై ఏళ్ల కిందట అభినందన్‌ జా అనే వ్యక్తి పంజాబ్‌కి పనికి వెళ్లి తిరిగి వస్తూ సరదాగా ఓ నెమళ్ల జంటను తెచ్చాడట. అప్పటివరకూ ఆ ఊరికి నెమలి జాడే తెలీదు. ‘ఇంతింతై వటుడింతై’ అన్న చందంగా వాటి సంఖ్య 500 దాటిపోయింది. ‘తొలినాళ్లలో ఇంటి పెరట్లోనే పెంచాను. తోటి గ్రామీణులూ వాటిని ఎంతో ప్రేమగా చూడటం, సంతతి కూడా పెరగడంతో స్వేచ్ఛగా వదిలేశాను. బయటివాళ్లూ జంతువుల నుంచి వాటికి ఎలాంటి హానీ కలగకుండా ఓ కంట కనిపెడుతూనే ఉంటాం. మా ఊరెంట వెళ్లేవాళ్లూ వాటి నృత్యాన్ని చూసి ఆనందిస్తారే తప్ప, వాటిని చంపిన దాఖలాలేం లేవు. ఊరంతా నెమళ్లు తిరగాలన్న నా కల ఎట్టకేలకు నెరవేరింది’ అంటారు అభినందన్‌.

‘మొదట్లో అవి మా పంటల్ని బాగా పాడుచేసేవి. అయినా పట్టించుకునే వాళ్లం కాదు. కూరగాయలంటే నెమళ్లకు మరీ ఇష్టం కాబట్టి కాలీఫ్లవర్‌ లాంటి పంటలు వేయడం మానుకున్నాం. అయితే వాటి కారణంగానే మా ఊళ్లో క్రిమికీటకాలూ పాముల సంఖ్యా తగ్గిపోయింది. పంటల దిగుబడి పెరిగింది. ఎప్పుడైనా అవి ధాన్యపు సంచుల్ని కొరుకుతుంటాయి. అప్పుడు కూడా హుష్‌ అంటూ అదిలిస్తామే కానీ రాయి కూడా విసరం’ అంటూ చెప్పుకొస్తారు గ్రామీణులు.

ఆరణ్‌ను పోలినదే మరో గ్రామం… మాధోపూర్‌ గోవింద్‌. చంపారణ్‌ జిల్లాలోని ఈ ఊరికి ‘మయూర్‌ విహార్‌’ అనీ పేరు. దాదాపు డెబ్భై ఏళ్ల నుంచీ గ్రామీణులూ నెమళ్లూ కలిసి జీవిస్తున్నారు. ఊరిని సొంతిల్లులా భావిస్తూ అక్కడ నెమళ్లు గుంపులుగుంపులుగా తిరుగుతుంటాయి. పిట్టగోడలూ మిద్దెలూ ఎక్కి మరీ ఆడుతుంటాయి. వర్షాకాలంలో వాటి నృత్యాన్ని చూస్తూ పిల్లలూ పెద్దలూ ఎంతో ఆనందిస్తారు. డెబ్భై ఏళ్ల క్రితం చంద్రికా సింగ్‌ ఓ జత నెమళ్లను సోనేపూర్‌ నుంచి కొనుక్కొచ్చి పెంచడంతో నెమళ్ల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. గ్రామీణులు వీటికోసం ప్రత్యేకంగా ఆవాసాల్ని ఏర్పాటు చేయడంతోబాటు
ఓ చెరువుని కూడా తవ్వారట. ఎవరైనా వీటికి హాని కలిగిస్తే శిక్షిస్తారట.
మరి, మనూళ్లకీ ఆ అందాల అతిథుల్ని ఆహ్వానిద్దామా..!

About The Author