పెట్టుబడి స్వల్పం.. లాభం ఘనం…


అపరాల సాగులో రాణిస్తున్న మహబూబ్‌నగర్‌ రైతు
వర్షాధారంగా వాణిజ్య పంటలు పండిస్తూ తీవ్రంగా నష్టపోతున్న తెలంగాణ రైతులకు అపరాల సాగు వరదాయినిగా మారింది. తక్కువ కాలవ్యవధిలో, తక్కువ శ్రమ, పెట్టుబడితో సాగు చేసే వీలుండటంతో ఇప్పుడు రైతులు అపరాల సాగుపై దృష్టి పెడుతున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని నేరళ్లపల్లి గ్రామానికి చెందిన జక్క రాజేశ్వర్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. నాలుగేళ్లుగా సకాలంలో వర్షాలు లేక సేద్యంలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ స్థితిలో వ్యవసాయ అధికారుల సూచనతో అపరాల సాగు చేపట్టారు. తనకున్న 12 ఎకరాల్లో పెసర సాగు చేపట్టారు. డబ్ల్యూజీజీ-42 పెసర రకం విత్తనాన్ని తెచ్చి విత్తారు. తెలంగాణ ప్రభుత్వం అపరాల సాగును ప్రోత్సహించేందుకు పెసర విత్తనానికి 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. 12 ఎకరాలకు 72 కిలోల విత్తనం అవసరం కాగా, 50 శాతం సబ్సిడీ పోను కిలోకు రూ.60 చొప్పున రూ.4,320లకే విత్తనాలు లభించాయి. రెండుసార్లు పొలాన్ని కలియదున్ని జూన్‌ 25న పెసరను విత్తిన ఈ రైతుకు ఈ వారంలో పంట చేతికి రానున్నది. మధ్యలో అక్కడక్కడ తెగుళ్లు ఆశించినట్లు కనిపించడంతో రెండుసార్లు వేపనూనె పిచికారీ చేసినట్లు రాజేశ్వరరెడ్డి చెప్పారు. ఎకరాకు సగటున 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లో పెసర్లకు క్వింటాలు రూ.7 వేలు ధర ఉంది. దాన్నిబట్టి లెక్కేస్తే ఎకరాకు రూ.28వేల నుంచి రూ.35 వేల వరకు ఆదాయం వస్తుంది. 12 ఎకరాలకు ఖర్చులు పోను రూ. 3 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనావేస్తున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో, తక్కువ శ్రమ, పెట్టుబడితో పెసర పంటలో ఇంత ఆదాయం వచ్చే అవకాశం ఉండటం పట్ల ఈ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాజేశ్వరరెడ్డి స్ఫూర్తితో చుట్టుపక్కల ప్రాంతాల రైతులు అపరాల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. నేరెళ్ల గ్రామంలో వచ్చే ఏడాది 400 ఎకరాల్లో అపరాల సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పత్తి, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయాలంటే కనీసం ఎకరాకు రూ.20 వేల నుంచి రూ. 30 వేలు పెట్టుబడి పెట్టాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, మార్కెట్లో కనీస మద్దతు ధర లేకపోయినా రైతు తీవ్రంగా నష్టపోవాల్సిందే. పప్పుదినుసుల పంటల సాగుకు అయ్యే ఖర్చు, కూలీల ఆవశ్యకత, శ్రమ చాలా తక్కువగా ఉండి, ఆదాయం బాగుండటంతో అన్నదాతలు అపరాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. కేఎల్‌ఐ నీటి రాకతో యాసంగి సీజన్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లావ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో రైతులు వేరుశనగ సాగు చేస్తున్నారు. వానాకాలంలో దీర్ఘకాల పంటలను సాగు చేసి నష్టపోవడంతో పాటు సమయం వృథా అయి యాసంగిలో రెండో పంటకు అవకాశం ఉండడం లేదు. అపరాల పంట అవశేషాలు ఎరువుగా ఉపయోగపడడంవల్ల రెండో పంటకు భూసారం అనుకూలించి యాసంగిలో వేరుశనగ సాగు చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు ఆలోచిస్తున్నారు.

* స్వల్ప వ్యవధి పంటలకు ప్రోత్సాహం

నాలుగేళ్లుగా వరుసగా సాధారణ వర్షపాతం కన్నా చాలా తక్కువ నమోదవుతోంది. ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలైన పత్తి, మొక్కజొన్నలను ఎక్కువ మంది రైతులు సాగు చేపట్టి నష్టపోతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా త క్కువ కాల వ్యవధిలో పండే పంటలను సాగు చేసుకుంటే లాభాలు వస్తాయని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అపరాల సాగుతో పాటు సజ్జ, జొన్న, రాగులు వంటి తక్కువ నీటితో, తక్కువ కాల వ్యవధిలో, తక్కువ శ్రమతో సాగు చేసుకోవచ్చు.
కమల్‌కుమార్‌, మండల వ్యవసాయ అధికారి, తిమ్మాజిపేట

* పెసర సాగు ఆశాజనకం

ఏటా పత్తి సాగు చేస్తున్నాను. లక్షల్లో నష్టం వచ్చింది. వ్యవసాయ అధికారులు సూచనతో పెసర సాగు చేపట్టాను. రెండు నెలల్లో పంట బాగా ఎదిగింది. 3 లక్షల దాకా ఆదాయం వస్తుందనిపిస్తోంది. అధిక పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటలు సాగు చేసే కంటే తక్కువ పెట్టుబడితో, శ్రమతో సేద్యం చేసే అవకాశమున్న అపరాల సాగు ఉత్తమం. పైగా అపరాల సాగుతో భూమికి కూడా బలం చేకూరుతుంది.
– జక్క రాజేశ్వర్‌రెడ్డి, రైతు, నేరెళ్లపల్లి

About The Author