తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ…
తిరుమల, 2019 సెప్టెంబరు 14: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారంనాడు పౌర్ణమి రోజున మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను రాత్రి 7.00 నుండి 9.00 గంటల నడుమ టిటిడి ఘనంగా నిర్వహించింది. సెప్టెంబరు 30 నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా టిటిడి ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి ఉత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, సివిఏస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, సిఇ శ్రీ రామచంద్రరెడ్డి, అదనపు సివిఏస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఆలయ పేష్కర్ శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.