పాపికొండలో పడవ ప్రమాదం 50మంది మృతి… సీఎం జగన్ సీరియస్…


ప్రమాదం జరిగిన స్థలం.. గోదావరిలోనే అత్యంత లోతైన ప్రాంతం
గతంలో ను ఇక్కడ రెండు ప్రమాదాలు

పశ్చిమగోదావరి: కచ్చులూరు మండలం దేవీపట్నం సమీపంలో గోదావరిలో జరిగిన లాంచీ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. లాంచీలో ప్రయాణ సమయంలో దాదాపు 61 మందికి పైగా టూరిస్టులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. గల్లంతైన వారిలో 17 మందిని తూటిగుంట గ్రామస్థులు రక్షించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతం గోదావరిలోనే అత్యంత లోతైన ప్రాంతంగా అధికారులు చెబుతున్నారు. అక్కడ నది లోతు 300 అడుగులకు పైగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా పడవ ప్రమాద సమయంలో గోదావరిలో 5 లక్షల క్యూసెక్కల వరద నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, 2018 మే 16వ తేదీని పోలవరం మండలం వాడపల్లి వద్ద లాంచీ మునిగిన ఘనటలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మళ్లీ ఇప్పుడు పడవ ప్రమాదం గోదావరి జిల్లాల ప్రజలనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల ప్రజలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తోంది. బోటు యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్‌ సీరియస్‌

తూర్పుగోదావరి జిల్లాలో లాంచి ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు గోదావరిలో మొత్తం అన్ని బోట్లను నిలిపేయాలని అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులతో మాట్లాడారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫ్టర్లను సహాయక చర్యలకు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు

దేవిపట్నం లాంచీ ప్రమాదం నేపథ్యంలో విశాఖ జిల్లా పర్యాటకుల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా నుంచి పాపికొండల టూర్ కి ఎవరైనా వెళ్లి ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 180042500002 కి వివరాలు తెలపాలని వారి కుటుంబ సభ్యులకి కలెక్టర్ వినయ్ చంద్ విజ్ఞప్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-233-1077కి ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు కోరారు.

About The Author