నవ్విన నోరు మూతపడలేదు…


పగలబడి నవ్విన ఓ మహిళ నోరు మూతపడలేదు.. అలాగే ఉండిపోయింది . డాక్టర్ వచ్చి సరిచేసేదాకా పాపం నోరుతెరుచుకునే ఉండిపోయింది. చైనాలో రైలులో వెళుతున్నప్పుడు ఓ మహిళా పట్టరాని ఆనందంతో నవ్వేసింది. ఎంత గట్టిగా నవ్విందంటే.. ఆమె తన నవ్వును కంట్రోల్‌ చేసుకోలేకపోయింది. అంతే ఆ నవ్వు దెబ్బకు ఆమె దవడ పక్కకు జరిగిపోయింది. నోరు మూయడానికి వీలుపడలేదు. దవడ పక్కకు జరిగిపోయి నోరు మూసేందుకు, మాట్లాడేందుకు వీలుపడక ఆ మహిళ తీవ్ర అవస్థను ఎదుర్కొంది.
నొప్పితో అవస్థ పడుతూ కిందపడి దొర్లింది. దీంతో లౌ వెన్‌షెంగ్‌ అనే వైద్యుడిని అత్యవసరంగా పిలిపించారు. వైద్యుడు మొదట ఆ మహిళకు గుండెపోటు వచ్చిందేమో అనుకున్నాడు. కానీ, తీరా పరిస్థితి తెలిశాక.. తాను దవడ సరిచేసే.. నిపుణుడు కాకపోయినప్పటికీ.. ప్రయత్నించి చూస్తానని వైద్యుడు బాధిత మహిళకు తెలిపారు. ఆమె అంగీకరించడంతో ఆయన దవడను సరిచేసి ఉపశమనం కల్పించారు. గతంలో గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్ర వాంతులు అవ్వడంతో ఆమెకు ఇదేవిధంగా దవడ పక్కకు జరిగింది. ఒక్కసారి ఈ విధంగా దవడ పక్కకు జరిగితే.. పెద్దపెట్టున నవ్వడం.. నోరు మొత్తం పెద్దగా తెరవడం వంటివి చేయరాదని లౌ వెన్‌షెంగ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిపారు. గ్వాంగ్‌ఝౌ దక్షిణ రైల్వే స్టేషన్‌కు వెళుతున్న హైస్పీడ్‌ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నోరు మూయడానికి రాక అవస్థ పడుతున్న బాధిత మహిళ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

About The Author