శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భక్తులకు మ‌రింత ఆహ్లాదం…


జోరుగా మొక్కల పెంపకం…
ఆకర్షణీయమైన రంగులు, సువాసనలు వెదజల్లే పూలు

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో భ‌క్తుల‌కు మ‌రింత ఆహ్లాద క‌ర‌మైన ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం పెంపొందేలా తిరుమ‌ల‌లోని అన్ని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో పూల మొక్కల పెంపకం సాగుతోంది.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేర‌కు తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో టిటిడి అట‌వీ విభాగం డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల‌లోని అన్ని ర‌హ‌దారులు, రెండు ఘాట్‌రోడ్లు, అలిపిరి, శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గాల‌లో ఆకర్షణీయమైన రంగురంగుల పూలమొక్కలు, సువాసనలు వెదజల్లే పూలమొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్ర‌త్యేకంగా తిరుమ‌లలో రూ. 80 ల‌క్ష‌ల‌తో డివైడ‌ర్ల అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ఇక్క‌డి ప్ర‌ధాన ర‌హ‌దారుల‌లోని డివైడ‌ర్ల‌ను మ‌రింత అక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్ధేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందులో రూ. 14 ల‌క్ష‌లతో జిఎన్‌సి నుండి బాలాజి బ‌స్టాండ్ వ‌ర‌కు, రూ. 13 ల‌క్ష‌లతో సిఆర్‌వో నుండి రాంభ‌గీచ వ‌ర‌కు, రూ. 12 ల‌క్ష‌ల‌తో టిటిడి ఉద్యోగుల క్యాంటీన్ నుండి మేద‌ర మిట్ట వ‌ర‌కు ఉన్న రోడ్లలోని డివైడ‌ర్ల‌లో గ‌డ్డి, దేవ గ‌న్నేరు, లిల్లీ, మందార‌ము, ఇక్సోరా (ఎరుపు నూరు వరహాల చెట్టు), రోజా, క్రోట‌న్, వెదురు, బ్రామిక్‌, సంపంగి, పారిజాత‌ము, త‌దిత‌ర మొక్క‌ల‌ను పెంచి మనోహరంగా తీర్చిదిద్ధుతున్నారు.

అదేవిధంగా గోగ‌ర్భం డ్యాం వ‌ద్ద రూ.10 ల‌క్ష‌ల‌తో 10 హెక్ట‌ర్ల‌లో శ్రీ గంథం మొక్క‌ల పెంప‌కం చేప‌ట్టారు. ఇదివ‌ర‌కు 80 హెక్ట‌ర్ల‌తో శ్రీ గంథం మొక్క‌లు పెంచుతున్న విష‌యం విదిత‌మే. దీనితో టిటిడి మొత్తం 90 హెక్ట‌ర్ల‌లో శ్రీ గంథం మొక్క‌ల పెంప‌కం ప్రారంభించింది. శిలాతోర‌ణం వ‌ద్ద రూ. 40 ల‌క్ష‌ల‌తో శేషాచల అడ‌విలోని అరుదైన జీవ‌రాశులైన‌ దేవాంగ‌పిల్లి, నెమ‌లి, కొండ‌చిలువ‌, ఇత‌ర స‌ర్పాలు, న‌క్ష‌త్ర తాబేలు, గ‌ద్ధ, డేగ‌, ఊస‌ర‌వెళ్లి, బెట్టు ఉడ‌త‌ త‌దిత‌ర ప‌క్షులు, జంతువుల ఆకృతుల బొమ్మ‌లు రాళ్ళ‌తో నిర్మించారు. ఆకాశ గంగా వ‌ద్ద రూ.10 ల‌క్ష‌ల‌తో గ‌డ్డి, ఇక్సోరా, రోజా, బాదం త‌దిత‌ర మొక్క‌ల‌తో ఉద్యాన‌ వ‌నాల‌ను అభివృద్ధి చేశారు. ధ‌ర్మ‌గిరి, శ్రీ‌వారి పాదాల మార్గంలో రూ. 6 ల‌క్ష‌ల‌తో ప‌చ్చ‌దానాన్ని పెంపొందించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు.

తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద గ‌ల టోల్‌గేట్ల వ‌ద్ద మొక్కెల పెంప‌కం, అలిపిరి నుండి రుయా ఆసుప‌త్రి వ‌ర‌కు డివైడ‌ర్ల అభివృద్ధికి రూ. 10 ల‌క్ష‌లు వ్య‌యంతో ప‌నులు చేప‌ట్టారు. అంతేగాక రెండు ఘాట్ రోడ్ల‌కు ఇరువైపుల ఎర్ర‌తురాయి, గాడిచౌడ‌, రేలా వంటి పూల మొక్క‌లు నాటుతున్నారు. అలిపిరి, శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గంలో మందారం పూల చెట్లు ఏర్పాటు చేస్తున్నారు.

తిరుమల, తిరుప‌తిల‌లో ఎఫ్‌ఆర్‌వోలు శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, శ్రీ శివకుమార్ మొక్కల పెంపకం పనులను పర్యవేక్షిస్తున్నారు.

About The Author