బ్రహ్మోత్సవాలు…


ఏడుకొండల స్వామికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు జరిగినా ఏడాదికి ఒకమారు తొమ్మిదినాళ్లపాటు జరిగే బ్రహ్మోత్సవాలు తిరుమల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.

బ్రహ్మాది దేవతల కోరికపై కలియుగ మానవుల రక్షణకై “కలౌ
వేంకటనాయకః అన్న బిరుదుతో శ్రీవేంకటేశ్వరుడనే పేరుతో స్వయంవ్యక్త మూర్తిగా కన్యామాసం శ్రవణ నక్ష్మత్రం రోజున ఆవిర్భవించినాడు. ఆ రోజును పురస్కరించుకొని బ్రహ్మదేవుడు ఆ రోజుకు పూర్తి అగునట్లు తొమ్మిది నాళ్లపాటు శ్రీనివాసునికి ఉత్సవాలు నిర్వహించినాడు. బ్రహ్మదేవుడు నిర్వహించినందువల్ల బ్రహ్మోత్సవాలని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవేంకటేశ్వరునకు జరిగినందువల్ల బ్రహ్మోత్సవాలని ప్రసిద్ధి ఏర్పడింది.

బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ ఉత్సవాలేకాక కాలక్రమేణ ఎందరో రాజులు కూడా తిరుమలేశునకు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. క్రీ.శ. 614 పల్లవరాణి ‘సామవై’, భోగశ్రీనివాసమూర్తిని బహూకరించి, కన్యామాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ మూర్తిని ఊరేగించాలని ఏర్పాటు చేసిందట.

క్రీ.శ. 1254 చైెత్రమాసం లో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, క్రీ.శ. 1328 ఆషాఢ మాసంలో “ఆడి తిరునాళ్లు పేర త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు, క్రీ.శ. 1429 ఆశ్వయుజ మాసంలో వీరవ్రతాప దేవరాయలు, క్రీ.శ. 1446లో ‘మాసితిరునాళ్ల’ పేర హరిహరిరాయలు, క్రీ.శ. 1580లో “అచ్యుతరాయ బ్రహ్మోత్సవం” పేర అచ్యుతరాయలు అని ఇలా 1583 నాటికి బ్రహ్మోత్సవాలు సంవత్సరంలో ఇంచుమించు నెలకొకటి వంతున జరిగేవట!

కాలాంతరంలో ఆ రాజులూ, ఆ రాజ్యాల లాగే, వారు ఏర్పాటుచేసిన ఉత్సవాలు నిలిచిపోయాయి. కాని బ్రహ్మదేవుడు ఏర్పాటుచేసిన ఉత్సవం మాత్రం నేటికీ కొనసాగుతూ ఘనంగా నిర్వహింపబడుతూ ఉంది. ఇది తొమ్మదినాళ్లపాటు జరుగుతుంది.

ముందురోజు సాయంత్రం అంకురార్పణ, శ్రీవారి సేనాధిపతి
విష్వక్సేనులవారి ఆధ్వర్యంలో మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఆ మరునాడు ధ్వజారోహణనాడు బంగారుధ్వజస్తంభంపై గరుడ కేతనాన్ని ఎగురవేస్తూ సర్వలోకవాసులు ఆహ్వానింపబడతారు. ఆ రాత్రి
శ్రీస్వామివారికి పెద్దశేషవాహనం జరుగుతుంది. ఈ ధ్వజారోహణ రోజున *ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారు శ్రీవారికి పట్టువస్తాలు సమర్పిస్తారు*.

ఇక ఆ మరునాడు ఉదయం, సాయంత్రం రెండువేళలా రెండవరోజు చిన్నశేషవాహనం, హంస వాహనం మూడవరోజు సింహ వాహనం,ముత్యపు పందిరి, నాల్గవరోజు కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, ఐదవరోజు ఉదయం దంతపు పల్లకిలో మోహినీ అవతారం, ఆ రాత్రి గరుడోత్సవం జరుగుతుంది. ఆ రోజు శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి ధరించిన పూలమాల, మద్రాసు నుంచి కొత్త గొడుగులు వస్తాయి. వీటినన్నింటిని ధరించిన మలయప్పస్వామి బంగారు గరుడునిపై ఊరేగింపబడుతాడు. లక్షలాది మంది
భక్తులు గరుడోత్సవాన్ని తిలకిస్తారు.

ఇక ఆరవరోజు హనుమద్వాహనం, గజవాహనం, ఏడవరోజు సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, ఎనిమిదో రోజు రథోత్సవం, అశ్వవాహనం జరుగుతాయి. తొమ్మిదో రోజు చక్రస్నానం. ఆ రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహింపబడుతాయి.

అధికమాసం వచ్చిన ఏడాది తిరుమలేశునకు రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతాయి. ఒకటి కన్యామాసంలో వార్షిక బ్రహ్మోత్సవంగాను, మరొకటి శరన్నవరాత్రులలో నవరాత్రి బ్రహ్మోత్సవంగాను నిర్వహింపబడుతాయి.

About The Author