యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో టీఎస్ ఐఐసి-టిఐఎఫ్-ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును…
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ లో 438 ఎకరాలలో నెలకొల్పనున్న టీఎస్ ఐఐసి-టిఐఎఫ్-ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును నవంబర్ 1న ఉదయం 10 గంటలకు రాష్ట్ర పరిశ్రమల శాఖా మాత్యులు కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామికవేత్తలతో మంత్రి ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్పారు. మంత్రి కేటీఆర్ కార్యక్రమం విజయవంతానికి ఏర్పాట్లపై అధికారులతో దండుమల్కాపూర్ టీఎస్ ఐఐసి-టిఐఎఫ్ ఇండస్ట్రియల్ పార్కులో సోమవారం టీఎస్-ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న శాసనమండలి విప్ కర్న ప్రభాకర్ కేటీఆర్ కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి కేటీఆర్ దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతానికి అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని టీఎస్ ఐఐసీ అధికారులను చైర్మన్ బాలమల్లు ఆదేశించారు. పారిశ్రామికవేత్తలతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా మంత్రి కేటీఆర్ కార్యక్రమానికి తరలివస్తారని, ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. రూ.1553 కోట్ల పెట్టుబడులతో 450కి పైగా పరిశ్రమల ఏర్పాటుతో 35 వేల మందికి దండుమల్కాపూర్ ఎంఎస్ ఎం ఈ ఇండస్ట్రియల్ పార్కు ద్వారా ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొట్ట మొదటగా చిన్న,మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా దండుమల్కాపూర్లో మోడల్ ఇండస్ట్రియల్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. సమావేశంలో టీఎస్ ఐఐసీ ఎండి ఈవీ నర్సింహ రెడ్డి, సీఈఓ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, టీఎస్ ఐఐసీ సీఈ శ్యామ్ సుందర్, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు కె సుధీర్ రెడ్డి, కార్యదర్శి గోపాల్ రావు, శంకర్రావు, టీఎస్ ఐఐసీ మేనేజర్లు మహేశ్వర్, విఠల్, జోనల్ మేనేజర్, ఇతర అధికారులు, మునుగోడు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.