జర్నలిస్టుల హక్కులకోసం కదంతొక్కిన ఏ డబ్ల్యూ జే ఏ రెండు రోజుల చలో ఢిల్లీ విజయవంతం…


జర్నలిస్టుల హక్కులను హరించే జీవో ల బేషరతు ఉపసంహరణకు ,వర్కింగ్ జర్నలిస్టుల అభ్యున్నతికి ప్రభుత్వాలు చొరవ చూపాలనీ,ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ లతోఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పిలుపునిచ్చిన చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దేశ రాజధాని న్యూఢిల్లీ లో జరిగిన రెండు రోజుల ఆందోళన కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కింగ్ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .రెండోరోజైన బుధవారం జర్నలిస్టులంతా జంతర్ మంతర్ వద్ద మౌన దీక్షలో పాల్గొన్నారు .నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని,తెలంగాణ,ఆంధ్ర భవన్ నుంచి ప్రదర్శనగా వెళ్లి జంతర్మంతర్ వద్ద దీక్ష లో కూర్చున్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 2430, తెలంగాణలో జీవో నెంబర్ 239 జర్నలిస్టుల గొంతులు నొక్కే విధంగా ఉన్నాయన్న సంకేతాలు ఇచ్చే విధంగా నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని జర్నలిస్టుల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కే కోటేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విడుదల చేసిన రెండు జీవోలు కూడా జర్నలిస్టుల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం గా పరిగణింపబడే మీడియాను అణచివేయాలనుకోవడం అరాచకాలకు నాంది పలకడమే నని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఇలాంటి అరాచక జీవోలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.ఏది ఏమైనా ఈ రెండు జీవోలను తాము అంగీకరించేది లేదని నిర్ద్వందంగా స్పష్టం చేశారు. జీవోలను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.తెలుగు రాష్ట్రాలలో తదుపరి చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాల్లో జర్నలిస్టులంతా పాల్గొని తమ డిమాండ్లను సాధించుకుంటారని తెలిపారు. జీవోల ఉపసంహరణే కాకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఆరోగ్య బీమా కల్పించాలని,ఉచిత గృహ నిర్మాణం,వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.జర్నలిస్టులపై అరాచకవాదులు దాడులకు తెగబడుతున్నారని ,ఇది చాలదన్నట్టు గా ఏకంగా హత్యలకే తెగ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాలను సైతం పట్టించుకోకుండా అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తున్న విలేకరులకు వీటిని ఎదుర్కోవడం కష్టమైన పనేమీ కాదని వ్యాఖ్యానించారు. నేషనల్ కోఆర్డినేటర్ బెలిదె హరినాథ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ డబ్ల్యూ జే ఏ కృతనిశ్చయంతో ఉందన్నారు .నిర్భయంగా , చిత్తశుద్ధితో విధి నిర్వహించే విలేకరులకు ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వెన్నంటి ఉంటుందని ధీమా ఇచ్చారు. దీక్షలో పాల్గొన్న వారిలో నేషనల్ కోఆర్డినేటర్లు బెలిదె హరినాథ్ ,బాలు బోయపాటి, ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎ ఎంరాజు రెడ్డి , సంయుక్త కార్యదర్శి కామిశెట్టి రామకృష్ణ ,ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కిరణ్ కుమార్, ఆనంద్ , పేర్ల వెంకటయ్య, జగదీశ్వర్, సామాజిక కార్యకర్త ఆనంద్, చంద్ర శేఖర్, సురేష్, వెంకటేష్, నూతన్ తదితరులు పాల్గొన్నారు.

About The Author