ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు


హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ చేపట్టింది. అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లపై వాదనలు కొనసాగుతున్నాయి. నేరుగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు సీఎస్‌ ఎస్కే జోషి వివరణ ఇచ్చారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ కోర్టుకు హాజరయ్యారు.

ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్దంగా ఉన్నాయని న్యాయస్థానం తప్పుపట్టింది. ఐఏఎస్‌ అధికారులే హైకోర్టుకు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా? అని ప్రశ్నించింది.
రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించే నివేదిక ఇస్తున్నామని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. అలాగైతే మొదటి నివేదిక పరిశీలించాకుండానే ఇచ్చారా? అని ధర్మాసనం నిలదీసింది. తక్కువ సమయంలో తమ కార్యాలయంలో ఉన్న రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని తమను క్షమించాలని రామకృష్ణారావు కోరారు. క్షమాపణ కోరడం సమాధానం కాదని కోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టులకు వాస్తవాలు చెప్పాలని హెచ్చరించింది.

About The Author