ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు నిజంగా సంచలనాలే.

సమాజంలో ఉన్న సామాజిక అసమానతలని రూపుమాపేందుకు ఎంతగానో కృషి చేసారు ఎన్టీఆర్. ఈ విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు నిజంగా సంచలనాలే. ఉదాహరణకు తెలంగాణా ప్రాంతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు అంశం గురించి చెప్పుకోవచ్చు. 

నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ రాజ్య గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాధికారి లేదా కరణం వంటి ఉద్యోగానికి పట్వారీ అని పేరు. హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ వ్యవస్థ, భారత స్వాతంత్రానంతరం భారత రెవెన్యూ వ్యవస్థలో కూడా భాగమైంది. గ్రామాధికారులుగా వీరికి ఉన్న అధికారాలు పరిమితమే. అయితే  నాటి తెలంగాణలో విద్యావంతుల శాతం తక్కువగా ఉండడం, గ్రామంలోని రెవెన్యూ వ్యవహారాలన్నీ పట్వారీలకు కంఠోపాఠం కావడం కారణంగా వీరు ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. ఆ కారణంగా రైతులంతా పట్వారీల కనుసన్నల్లో మెలగాల్సి వచ్చేది. 

1984 వరకూ కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా నాడు ఎన్టీఆర్ రద్దుచేసారు. అనాదిగా వస్తున్న వ్యవస్థను…  పలుకుబడి, అధికారం కలిగి ఉన్న వారి నిర్వహణలో ఉన్న వ్యవస్థను రద్దుచేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అయినా సరే! తెలంగాణలోని పల్లె ప్రజలకు స్వేచ్చనిచ్చేందుకు ఈ తెగువ చూపారు ఎన్టీఆర్. ఆరోజు ఎంతో సాహసంతో ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో  తెలంగాణలోని నిరుపేద గ్రామీణులకు, రైతులకు, అణగారిన వర్గాలకు జరిగిన మేలు అంతాఇంతా కాదు. అందుకే తెలంగాణ పల్లెల్లో తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు ఈనాటికీ ఇంతటి అభిమానం.

About The Author