ఈ నలుగురికి ఒకేసారి పెళ్లి…
ఒకే కాన్పులో ఐదుగురు
పెళ్లి ఏర్పాట్లలో సోదరుడు
కష్టాల్ని జయించిన కుటుంబం
తిరువనంతపురం: ఇది ఇప్పటి మాట కాదు. దాదాపు పాతికేళ్ల నాటిది. 1995లో కేరళలో ఒక కుటుంబంలో ఒకే కాన్పులో అయిదుగురు బిడ్డలు పుట్టారు. అప్పట్లో అక్కడ ఈ వార్త ఓ సంచలనం. వారు స్కూల్లో చేరిన మొదటిరోజు, తర్వాత కాలేజీలో చేరినప్పుడు, ఆ తర్వాత వారు మొదటిసారి ఓటు వేసినప్పుడు మీడియా విశేష ప్రాధాన్యమిచ్చింది. కానీ వారి కష్టాలు, కన్నీళ్లు, చేదు అనుభవాల్ని ఎవరూ పట్టించుకోలేదు. అయిదుగురిలో నలుగురు ఆడపిల్లలు. ఒక మగవాడు. ఇప్పుడు ఆ నలుగురు ఆడపిల్లలు తమ జీవితాల్లో సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 26న గురువాయూర్‌లోని శ్రీకృష్ణ ఆలయంలో వారు పెళ్లిచేసుకోబోతున్నారు.
వారి సోదరుడు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. 1995 నవంబర్ 18 వారు పుట్టినప్పుడు ఓ చిరు వ్యాపారిగా ఉన్న వారి తండ్రి చాలా సంతోషించాడు. వారంతా ఉత్తర నక్షత్రంలో పుట్టారు కాబట్టి పిల్లలకూ ఆయన ఒకే విధంగా ఉత్రజ, ఉత్తర, ఉత్తమ, ఉత్ర, ఉత్రజన్ అనే పేర్లు పెట్టాడు. తమ ఇంటికి కూడా పంచ రత్నం అనే పేరు పెట్టాడు. అయిదుగురికీ ఒకే డ్రెస్, ఒకే రకం వస్తువులు ఇవ్వడంకోసం ఆయన చాలా శ్రమపడ్డాడు.ఆయన భార్యకుగుండె జబ్బు వచ్చినప్పటి నుంచీ ఆ కుటుంబాన్ని ఆర్థికసమస్యలు ఒక దాని తర్వాత ఒకటి చుట్టుముట్టాయి. పిల్లలు పుట్టిన తొమ్మిదేళ్లకు అనారోగ్యంతో ఉన్న భార్యను, అయిదుగురు పిల్లల్ని ఒంటరిగా వదిలేసి 2004లో ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ సంఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ కుటుంబం ఎలా ఉందో పట్టించుకోని మీడియాను చాలామంది దుమ్మెత్తిపోశారు. అయితే సమాజంలో కొందరు మంచివాళ్లు ఉండడంతో వారికి సాయం లభించింది. ఆ పిల్లల తల్లికి ప్రభుత్వోద్యోగం దొరికింది. కొన్ని మీడియా సంస్థలు కూడా వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చాయి. పిల్లలకోసమే బతుకుతున్న ఆ తల్లి ఎన్నో కష్టాలు పడి వారిని పెంచింది. మంచి చదువు చెప్పించింది. ఈ ఏడాది 24వ ఏట అడుగిడబోతున్న వారు ఇప్పడు తమ కాళ్లపై తాము నిలబడగలిగారు. ఒక కూతురు ఫ్యాషన్ డిజైనర్. ఇద్దరు అనస్థీషియా టెక్నీషియన్లుగా ఉన్నారు. మరొకామె రచయిత్రి. వాళ్ల సోదరుడు ఉత్రజన్ సాంకేతిక నిపుణుడు. ‘నా భర్త హఠాత్తుగా మరణించినప్పుడు ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఆ తర్వాత మా పిల్లల కోసమే బతకాలనుకొని, జీవితంతో పోరాడాను’ అని ఆమె కష్టాలు దాటి, ఎలా విజయం సాధించిందీ చెప్పారు.