వైకాపా నేతలతో కలిసి పార్టీలో చిందులేసిన రెవెన్యూ అధికారులు…
https://www.facebook.com/videos/2535873770014585/
రెవెన్యూ అధికారులు తమ స్థాయిలను మరిచి అధికార పార్టీకి చెందిన వైకాపా నేతలతో కలిసి పార్టీ ప్రచార గీతాలకు డ్యాన్స్ లు వేసారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ పాటలకు అధికారులు చిందులు వేసిన వీడియో నెట్టింట్లో వైరెల్ గా మారాయి.సోషల్ వీడియో గ్రూపులలో హల్ చల్ చేసాయి. శ్రీకాకుళం జిల్లా భామిని మండల రెవెన్యూ అధికారుల చేష్టలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సాక్ష్యాత్తు మండల మెజిస్ట్రేట్ గా ఉన్న తహాసిల్థార్ తో పాటు ఇతర రెవెన్యూ సిబ్బంది బహిరంగంగానే వైకాపా నేతలతో కలిసి పార్టీ చేసుకోవడం దానిలో రాజకీయ పాటలకు చిందులు వేసిన తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.భామిని మండలంలోని నేరెడి గ్రామంలో ఆదివారం అక్కడి వైకాపా శ్రేణులు పిక్నిక్ నిర్వహించాయి.ఈ పిక్నిక్ లో భామిని తహాసిల్థార్ ఆర్ .నరసింహమూర్తి,ఆర్.ఐ కృష్ణారావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కొందరు పిక్నిక్ కి హాజరై వెనువెంటనే తిరుగుముఖం పట్టగా తహాసిల్థార్ నరసింహమూర్తి మరికొందరు మాత్రం అక్కడే విందు, వినోద కార్యక్రమాలలో పాల్గోన్నారు. అధికార వైకాపా నేతలతో కలిసి వారు తమ అధికార పదవులను మరిచి చెట్టాపట్టాలు వేసుకుని గంతులేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబందించి ఎన్నికల సమయంలో ఉపయోగించిన రాజకీయ పాటలను అక్కడ వేయగా వాటికి అధికారులు,పార్టీ శ్రేణులతో కలిసి చిందులు వేసారు.
భామిని మండలంలోని వంశధార నదీ పరివాహక ప్రాంతాలలో పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలు ఇసుక తరలింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఇసుక దందా కొనసాగుతుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.వైకాపా నేతలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భామిని మండలంలోని కీలక స్థానాలకు అధికారులను సిఫార్సులు చేసి మరి నియమించుకున్నారని సమాచారం . సదరు అధికారులు కూడా స్వామి భక్తిని చాటుకుంటూ అధికార పార్టీ వర్గానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని భామిని మండలంలోని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతునే ఉంది.అలాగే రైతు భరోసా నిధులలో కూడా అధికార పార్టీ అనుకూలంగా వ్యవహరించడంతో రెవెన్యూ అధికారులకు పిక్నిక్ పేరు మీద సదరు నాయకులు రాచమర్యాదలు చేసారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా రెవెన్యూ అధికారులు,సిబ్బంది కలిసి వైకాపా శ్రేణులతో కలిసి ఆడిపాడిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.
ఇటువంటి అధికారుల వల్ల పాలన ఏకపక్షంగా సాగుతుందే తప్ప అందరికి న్యాయం జరిగే పరిస్థితి ఉండదని జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణం స్పందించి అధికార పార్టీ శ్రేణులతో కలిసి చిందులు వేసిన అధికారుల పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.