శబరిమల ఆలయం వద్ద 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు
కేరళ : శబరిమల అయ్యప్పస్వామి ఆలయం వద్ద 12 ఏళ్ల బాలికను ఆలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రి, బంధువులతో పాటు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు బాలిక వచ్చినట్లు తెలిసింది. అయితే.. ఆ బాలిక వయసు నిర్ధారించే నిమిత్తం పోలీసులు ఫ్రూఫ్స్ చెక్ చేశారు. అనంతరం.. ఆమె వయసు 12 సంవత్సరాలుగా పోలీసులు తేల్చారు. అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధాన్ని 1991లో కేరళ హైకోర్టు చట్టబద్ధం చేసింది.
2018, సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చని, అయ్యప్పను పూజించవచ్చని తీర్పు వెల్లడించడంతో కొందరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం, భక్తులు వారిని అడ్డుకోవడం.. ఘర్షణ జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఈసారి భద్రతను కట్టుదిట్టం చేశారు. సుప్రీం తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై స్పష్టత వచ్చేవరకూ అన్ని వయసుల మహిళలకు అయ్యప్ప దర్శనం వీలుపడకపోవచ్చని తాజా ఘటనతో స్పష్టమైంది.