టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
తిరుపతి, 2019 డిసెంబరు 01టిటిడి వెబ్సైట్లో “యేసయ్య” అనే పదం ఎప్పుడూ లేదని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలిసి ఛైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ టిటిడిలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఒక పత్రిక దురుద్దేశపూర్వకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కథనం ప్రచురించిందన్నారు. ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని కొన్ని దుష్టశక్తులు అన్యమత ప్రచారం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని చెప్పారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి జోలికి వస్తున్న ఇలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. టిటిడిపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్లైన్ వేదికగా టిటిడిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
గూగుల్ సెర్చింజన్లో “టిటిడి వికారినామ సంవత్సర పంచాంగం 2019-20” అని టైప్ చేస్తే అందులో “శ్రీ యేసయ్య” అనే పదం ఆ డిస్ప్లేలో శనివారం కనిపించిందన్నారు. టిటిడి పంచాంగం మొదటి పేజీలో తెలుగులో “శ్రియై నమః” అనే పదం కనిపిస్తుందని, దీన్ని గూగుల్ ఇంటర్‌ప్రిటర్‌లో తీసుకున్నపుడు హెచ్‌టిఎంఎల్ క్యాషెలో “శ్రీ యేసయ్య”గా మార్పు చెంది ఉండవచ్చన్నారు. గూగుల్ ఇంటర్‌ప్రిటర్‌లో తర్జుమా అయ్యే పదాలు పిడిఎఫ్ ఇమేజ్, బార్డర్ పరిమాణం, ఫాంట్ సైజు, ఫాంట్ టైపు, అక్షరాల మధ్య స్పేస్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఇది గూగుల్ ఇంటర్ప్రిటర్ సమస్యే గానీ, టిటిడి పంచాంగంలో దొర్లిన తప్పు కాదని తెలియజేశారు.ఈ సమస్యను అధిగమించడానికి గాను ఈ విషయాన్ని శనివారం గూగుల్‌కు రిపోర్టు చేసి వివరణ కోరామని, అ తరువాత గూగుల్ క్యాషెలో అప్డేట్ అవడానికి 12 గంటలు పట్టిందని, ఆ తరువాత ఆ పదం కనిపించలేదని ఛైర్మన్ తెలిపారు. టిటిడి వెబ్‌సైట్‌ను బయట నుండి ఎవరూ హ్యాక్ చేయడం గానీ, టిటిడి ఇన్‌హౌస్‌లో ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం అయినట్టుగానీ ఐటి టెక్నికల్ టీమ్ విచారణలో తెలియలేదన్నారు. ఇది కేవలం గూగుల్ ఇంటర్ప్రిటర్ సమస్యగానే గుర్తించామని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి పాల్గొన్నారు.