ఇప్పుడు యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవికాల్ SR 505. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కైనీ సిగరెట్ గంజాయి అల్కహాల్ గుట్కాలకు మించిన ప్రాణాంతక మాదక ద్రవ్యం ఇది. కేవలం నలభై రూపాయలకే ఫెవికాల్ డబ్బా మార్కెట్లో లభించడంతో ఇప్పుడు కాలేజీ విద్యార్ధులు మాత్రమే కాదు స్కూలు పిల్లలు, గృహిణులు సైతం దీనికి బానిసలవుతున్నారు.

ఈ ఫెవికాల్ SR 505 లో ఉన్న లిక్విడ్ ను కావాల్సినంత మోతాదులో ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకుని దానిని మొహానికి తగిలించుకుని దాని నుంచి విడుదలయ్యే ఘాటైన వాయువులను పీల్చుతూ మైకంలో మునిగి తేలుతుంది నేటి యువత. ఒక్కసారి దీనిని వాడితే ఇక దీనికి బానిసగా మారాల్సిందే.

అన్ని హార్డ్ వేర్ షాపుల్లో దొరికే ఈ ఫెవికాల్ ను ఇప్పుడు కలప పనులు చేసే వడ్రంగివారు మాత్రమే కాదు స్కూలుపిల్లలు యువతీయువకులు గృహిణులు సైతం విరివిగా వాడుతున్నారు. అత్యంత తక్కువ ధరకే మద్యాన్ని మించిన మత్తునీ మైకాన్నీ కల్పిస్తుండడం వల్ల దీనిని వాడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ క్రమక్రమంగా ఇప్పుడు గోదావరిజిల్లాలకు సైతం పాకుతుంది.

ఫెవికాల్ SR 505 వాడితే గుండెపైన నాడీవ్యవస్ధపైన జీర్ణవ్యవస్ధపైన మెదడుపైన తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. ఈసోఫాగస్ దెబ్బతింటుంది. అన్నవాహిక క్యాన్సర్ వస్తుంది. గొంతు వ్యాధులు వస్తాయి. నరాలు చచ్చుబడిపోతాయి. రక్తప్రసరణలో తీవ్ర మార్పులు వస్తాయి. మానసిక వ్యాధులకు గురౌతారు. కోమాలోకి వెళ్లే అవకాశంతో పాటు కొద్దిరోజులకే హార్ట్ ఎటాక్ తో మరణించే ప్రమాదం కూడా ఉంది.

ప్రయోగాలు, ప్రాజెక్ట్ వర్కుల పేరుతో పుస్తకాల బ్యాగులలోనే వైటనర్ లను, ఫెవికాల్ డబ్బాలను పెట్టుకుని తిరుగుతున్న ఈ సమయంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల ప్రవర్తననూ, వారు చేస్తున్న స్నేహాలనూ, అవుతున్న అలవాట్లనూ గమనించుకోవాలి. వ్యసనాల వల్ల కలిగే నష్టాలపై వారికి అవగహాన కలిగించాలి. తమ పిల్లలు వ్యసనాలకి గురయినట్లు గుర్తిస్తే వారికి సైకాలజిస్ట్ ద్వారా తగిన కౌన్సిలింగ్ ఇప్పించాలి. లేకుంటే మీ పిల్లల ఆరోగ్యమే కాదు భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. పిల్లలపై మీరు పెంచుకున్న నమ్మకమో , పని ఒత్తిడిలో మీరు చూపించే నిర్లక్ష్యమో మీ పిల్లల జీవితాలకు శాపంగా మారితే రేపు భాదపడేదీ నష్టపోయేదీ మీరు మాత్రమే కాదు మీ తరువాతి తరం కూడా.

యువత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఫెవికాల్ అమ్మకాలు చేసే హార్డ్ వేర్ షాపుల వారు ఈ విషయంలో కాస్త భాద్యతగా వ్యవహరించాలి. ఎవరికి అమ్ముతున్నాం, వారు దేనికి ఉపయోగించడానికి కొంటున్నారు వంటివి తెల్సుకుని మాత్రమే అమ్మకాలు సాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలి. మున్సిపాలిటీ అధికారులు, పంచాయితీ అధికారులు తమ పరిధిలోని హార్డ్ వేర్ షాపుల వారికి ఈ సమస్యపైన , దీని తీవ్రత పైన అవగాహన కల్పించాలి.

భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని మీవంతు భాద్యతగా మీ మిత్రులకీ, కుటుంబ సభ్యులకీ దీనిపై అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ…..

About The Author