సీరియల్ రేపిస్టుని కళ్ళలో కారం కొట్టి, కూరగాయలు తరిగే కత్తులతో కోర్టు హాలులో చంపిన బాధితులు.


ఇది కథ కాదు: సీరియల్ రేపిస్టుని కళ్ళలో కారం కొట్టి, కూరగాయలు తరిగే కత్తులతో కోర్టు హాలులో చంపిన బాధితులు.

కస్తూర్బా నగర్ నాగపూర్ నగరంలో ఒక మురికివాడ. దళితులు ఎక్కువగా ఉన్న ఆ కాలనీలో ఆడవారికి పేదరికం, నిరక్ష్యరాస్యత, ఇంటి యజమాని తాగుడు అలవాటు లాంటి సమస్యలతో పాటు అదనంగా ఉన్న అంతకు మించిన సమస్య అక్కు యాదవ్ అలియాస్ భరత్ కాళిచరణ్ అనే కీచకుడు. రాజకీయ పలుకుబడి బాగా ఉన్న వీడు ఆ కాలనీ మీద పడి కంటికి నదురుగా కనిపించిన ఆడపిల్లని వయసుతో సంబంధం లేకుండా మానభంగం చేసేవాడు.

ఆర్ధికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న వాళ్లు పోలీసుల దగ్గరకూ,లాయర్లు దగ్గరకూ పోలేరని వాడి నమ్మకం. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా వీడిచ్చే మామూళ్లకు ఆశపడిన పోలీసులు కేసు ఫైల్ చేయకుండా వారి వివరాలు వీడికి అందించేవారు. వీడు తన మనుషులతో పోయి వాళ్ళని బెదిరించేవాడు. “రేపే బెయిల్ మీద బయటకొస్తా. వచ్చి నిన్ను మళ్లీ రేప్ చేస్తా. లేదంటే నీ అక్కనో, చెల్లినో రేప్ చేస్తా. నీ తండ్రినో, అన్ననో చంపేస్తా” అని భయపెట్టి ఎవరూ కేసులు పెట్టకుండా చేసేవాడు.

అయితే ఒకసారి ఉషా నారాయణే అని ఒక బాధితురాలు స్థానిక పోలీసులను నమ్ముకోకుండా తెలిసిన వారి సాయంతో పోలీసు కమిషనర్ ని ఆశ్రయించింది. ఆయన ఆమెకు రక్షణ కల్పించి, కేసు బుక్ చేయించి, అక్కు యాదవ్ ని అరెస్టు చేయించారు. ఆ మరుసటి రోజు, ఆగస్టు 13,2004న బెయిల్ విచారణ కోసం వాడిని కోర్టుకు తీసుకొస్తారని కాలనీలో వారికి తెలిసింది.

వాడి బాధితులు, వారి కుటుంబ సభ్యులు దాదాపు రెండు వందల మంది మహిళలు కారం పొట్లాలు కూరగాయలు తరిగే కత్తులతో కోర్టు దగ్గరకు చేరుకున్నారు. అక్కూ యాదవ్ పోలీసు వ్యానులో వచ్చాడు. కోర్టులోకి పోతూ ముందు నిల్చుని ఉన్న ఒక బాధితురాలి వైపు చూసి ఆగ్రహంతో, “ఒసేయ్ లంజా. కాసేపట్లో బెయిల్ మీద బయటకొస్తా. వచ్చిన వెంటనే నిన్ను రేప్ చేస్తా” అన్నాడు. దాంతో ఆ మహిళ లో ఎప్పటినుండో దాచుకున్న కోపం కట్టలు తెంచుకొంది. కాలికున్న చెప్పు తీసి వాడి మీద విరుచుకుపడు, ఆ చెంపా ఈ చెంపా వాయిస్తూ “ఒరేయ్ ఈ రోజు ఇక్కడి నుంచి నువ్వో, నేనో ఒకరమే ప్రాణాలతో బయటకు పోతామురా”అని అరిచింది.

చూసే లోగా అక్కడ ఉన్న మహిళలందరూ వాడి మీద విరుచుకుపడ్డారు. వెంట తెచ్చుకున్న కారం కళ్ళలో కొట్టి పైన పడ్డారు. కూరగాయల తరిగే కత్తులతో, రాళ్ళతో దాడి చేసి, అందిన చోటల్లా పొడిచారు. ఒకావిడ కత్తితో పురుషాంగం కోసేసింది. ఆ ఆగ్రహావేశాలు చూసిన పోలీసులు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. పదంటే పది నిమిషాలలో ఆ మహిళల ఆవేశం చల్లారింది. తరువాత పోస్టుమార్టంలో అక్కూ యాదవ్ శవం మీద డెబ్భై కత్తిపోట్లు లెక్క పెట్టారు డాక్టర్లు.

అయిదు మంది మీద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు కస్తూర్బా నగర్ లోని ఆడవాళ్ళందరూ బాషా సినిమాలో లాగా హత్య చేసింది నేనంటే నేను అని ముందుకొచ్చారు. కొంతమంది మీద కేసు నమోదు చేశారు. 2012 వరకూ కేసు కొనసాగింది కానీ సాక్ష్యాధారాలు లేక ఎవరికీ శిక్ష పడలేదు.

About The Author