దిశ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కంటతడి..
నిర్భయ ఘటన తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా దిశ ఘటన సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడిన దోషులను వెంటనే ఉరితీయాలని దేశం మొత్తం ముక్తకంఠంతో గళమెత్తింది.
ఈ ఘటనపై సోమవారం పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కన్నీటీ పర్యంతమయ్యారు.
మహిళలపై దాడులు చేయడం ఒక సామాజిక రోగంగా మారపోయిందన్నారు. పోలీస్ వ్యవస్థలో కూడా చాలా లోపాలున్నాయని.. ఫిర్యాదు చేసేందుకు వస్తే తమ పరిధి కాదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేవలం చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదని, ఈ పరిస్థితిపై మార్పు రావడానికి సమాజం అంతా కృషి చేయాలన్నారు.
తల్లిదండ్రులు పిల్లల్లో నైతిక విలువల్ని పెంపొందించాలని, సామాజిక చైతన్యంతోనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు సత్వరమే న్యాయం లభించాలని వెంకయ్యనాయుడు అన్నారు.
ఇక, అంతకుముందు లోక్ సభలో ఈ ఘటనపై చర్చ సందర్భంగా.. అన్నీ పార్టీలు సహకరిస్తే ఇలాంటి ఘటనలపై కొత్త చట్టాలను తయారు చేసి, నిందితులకు సత్వరమే కఠిన శిక్ష పడేలా చూస్తామని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.