పి.చిదంబరంకు ఎట్టకేలకు బెయిలు లభించింది.


ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బుధవారంనాడు బెయిలు మంజూరు చేసింది. ఈడీ నమోదు చేసిన ఈ కేసులో చిదంబరానికి అత్యున్నత న్యాయస్థానం బెయిలు మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. రెండు లక్షల పూచీకత్తుపై బెయిలు మంజూరుకు ఆదేశించింది.

న్యాయమూర్తులు ఆర్.భానుమతి, ఏఎస్ బోపన్న, హృషికేష్ రాయ్‌తో కూడిన ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు ఈ తీర్పు ఇచ్చింది. దీంతో 105 రోజుల జైలు తర్వాత చిదంబరానికి బెయిలు దొరికినట్టయింది. పార్లమెంటు శీకాతాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చిదంబరం బెయిలుపై విడుదల కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కేసులో చిదంబరం సాక్షాలను నీరుగార్చడం కానీ, సాక్ష్యులను ప్రభావితం చేయరాదని, కేసుకు సంబంధించి ప్రెస్ ఇంటర్వ్యూలు కానీ, బహిరంగ ప్రకటనలు చేయరాదని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. విదేశీ పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని కూడా ఆదేశించింది. కోర్టు అనుమతి లేనిదే విదేశాలకు వెళ్లరాదని పేర్కొంది.

ఐన్‌ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ హైకోర్టు గత నవంబర్ 15న చిదంబరానికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిలు ఇవ్వలేమని పేర్కొంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును అశ్రయించారు. చిదంబరం దాఖలు చేసుకున్న బెయిలు అభ్యర్థనపై ఇటు చిదంబరం, అటు ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం గత నవంబర్ 28న తీర్పును రిజర్వ్ చేసింది.

చిదంబరంపై 2017 మేలో సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. అదే ఏడాది చివర్లో ఈడీ సైతం మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. తొలిసారి గత ఆగస్టు 21న చిదంబరాన్ని ఈ కేసులో సీబీఐ అరెస్టు చేయగా, రెండు నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది.

అయితే, అక్టోబర్ 16న మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులోనే చిదంబరం కాలం గడిపారు. కాగా, చిదంబరం గురువారం పార్లమెంటుకు హాజరవుతారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ప్రకటించారు. ‘‘ఆహా…. 106 రోజుల తర్వాత…’’ అని బెయిల్ పై ట్విట్టర్ వేదికగా కార్తి పేర్కొన్నారు.

About The Author