దిశ ఎన్ కౌంటర్ పై విచారణకు త్రిసభ్య కమిషన్ – ఆరు నెలల్లో నివేదిక..


సుప్రీం కోర్టు.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణకు ముగ్గురు సభ్యుల కమిషన్ ను ఏర్పాటు చేసింది.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్లో వీఎన్ రేఖ, సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ సభ్యులు. ఆరు నెలల్లో దీనిపై విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ కమిషన్‌కు స్పష్టం చేసింది. వారికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కమిషన్ చేపట్టబోయే విచారణ వివరాలను మీడియాకు లీక్ కాకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే కమిషన్ విచారణకు అయ్యే ఖర్చు అంతటిని తెలంగాణ ప్రభుత్వమే భరించాలని కోరింది.. కమిషన్ కోసం ఒక కార్యాలయంతో పాటు సభ్యులు కోరిన విధంగా ఇతర సిబ్బందిని సమకూర్చాలని ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీకి సూచించింది.. అలాగే ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన జరుగుతున్న అన్ని రకాల దర్యాప్తులను ఆపాలని, ఇకపై ఈ కమిషన్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుందని తేల్చి చెప్పింది.అంతకుముందు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో వాదనలు జరిగాయి. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నిందితులు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కున్నారని ఆయన కోర్టుకు వివరించారు. పోలీసులపై కాల్పులు జరిపారని,రాళ్లు రువ్వారని తెలిపారు. నిందితులు తాము లాక్కున్న రివాల్వర్స్‌తోనే పోలీసులపై కాల్పులు జరిపారా అని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బోబ్డే ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చిన ముకుల్ రోహత్గీ వాళ్లు కాల్చారు కానీ బుల్లెట్ల నుంచి పోలీసులు తప్పించుకున్నారని వివరించారు. కాల్పులపై ప్రత్యేకంగా తాము దర్యాప్తు చేయాలనుకుంటున్నామని సీజేఐ అన్నారు. కోర్టు ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా లేదని రోహత్గీ సమాధానం ఇచ్చారు. ఎన్‌కౌంటర్ పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు. గన్స్ లాక్కోవడంపై ఎఫ్ ఐ ఆర్ నమోదైందని అన్నారు. సిట్‌తో పాటు సమాంతర దర్యాప్తునకు సీజేఐ ప్రతిపాదించగా ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని రోహత్గీ తెలిపారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు అన్ని విషయాలు త్రిసభ్య కమిషన్ విచారణలో వెలుగులోకి వస్తాయని పేర్కొంది.

About The Author