జనశక్తి మాజీ నేత చంద్రన్న మృతి


హైదరాబాద్‌: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో జనశక్తి పక్షాన ప్రతినిధిగా పాల్గొన్న జనశక్తి మాజీ నేత చంద్రన్న(75) గురువారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. కొంతకాలంగా మధుమేహం, శ్వాసకోశ వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల విద్యానగర్‌లోని ఆంధ్ర మహాసభ ఆస్పతిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందారు.
యాదాద్రి జిల్లా టంగుటూర్‌ గ్రామానికి చెందిన చంద్రన్న ఈసీఐఎల్‌ ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగం చేసే సమయంలో విప్లవ కార్మిక సంఘాలతో పరిచయం ఏర్పడి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టో), జనశక్తిల రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. బీడీ, సింగరేణి కార్మికుల అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాంనగర్‌లోని స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

About The Author