శభాష్ తెలంగాణ పోలీస్… మెచ్చుకున్న ఏపీ ప్రయాణికుడు

అతని పేరు ఆరిఫ్. సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌లో హైదరాబాద్… శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాడు. అక్కడి నుంచీ విజయవాడ వెళ్లేందుకు ఎల్బీ నగర్‌కి క్యాబ్‌ బుక్ చేసుకున్నాడు. ఎల్బీ నగర్‌లోని రెయిన్ బో హాస్పిటల్ దగ్గర క్యాబ్ దిగాడు. ఓ క్షణం అటు తిరగగానే… ఇటు క్యాబ్ డ్రైవర్ వేగంగా క్యాబ్ నడిపి లగేజీతో సహా పరారయ్యాడు. షాకైన ఆరిఫ్… వెంటనే 100కి కాల్ చెయ్యగా… రాచకొండ పోలీసులు క్షణాల్లో స్పాట్‌కి వచ్చారు. వెంటనే తమ దగ్గర ఉన్న యాప్‌తో కారుకి సంబంధించి సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. దాని నెంబర్ ట్రాక్ చేశారు. దాని డ్రైవర్‌ను గుర్తించి… వెంటనే ఎల్బీనగర్‌లో ఏ స్పాట్ నుంచీ పారిపోయాడో, అదే స్పాట్‌కి లగేజీతో సహా రావాలని అతనికి ఆర్డరేశారు.

ఆ డ్రైవర్ వచ్చేవరకూ అక్కడే ఉండి, ఆరిఫ్‌కి తిరిగి లగేజీ అప్పగించారు. పోలీసులు తన పట్ల చూపిన శ్రద్ధకు తాను ఎంతో రుణపడి ఉన్నాననీ, రాచకొండ పోలీసులకు హాట్సాఫ్ చెబుతున్నాననీ ఆరిఫ్ తెలిపారు. పోలీసులు టెక్నాలజీని ఉపయోగిస్తున్న తీరు తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని, ఇలాంటి పోలీసులు ఉంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదని ఆరిఫ్ అభిప్రాయపడ్డారు.

 

About The Author