శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ కు జలశోభ…


-23 టీఎంసీలకు చేరిన నీటినిల్వ
-ఎల్‌ఎండీలో నిర్ణీతస్థాయి తర్వాత పూర్తిస్థాయిలో నిల్వ

ఏది అసాధ్యమనుకున్నామో.. అది సాధ్యమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజన్‌తో చేపట్టిన పనులు రికార్డు సమయంలో పూర్తయి.. ఫలితాలను అందిస్తున్నాయి. దశాబ్దాల తర్వాత శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేరు) ఇప్పుడు నిండుగా నీటితో మిలమిల మెరిసిపోతున్నది. కాళేశ్వరం ఎత్తిపోతలలో కీలకమైన జంక్షన్‌ రిజర్వాయర్‌గా ఉన్న ఈ జలాశయంలో సాంకేతికంగా ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడానికి మార్గం సుగమమైంది. ప్రభు త్వం సాంకేతిక ప్రొటోకాల్‌కు అనుగుణంగా రిజర్వాయర్‌లో నీటిస్థాయిని పెంచుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడంతో శ్రీరాజరాజేశ్వర జలాశయం పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 23 టీఎంసీలకు చేరిన నీటినిల్వను త్వరలోనే వందశాతం నిల్వకు తెచ్చేందుకు అధికార యం త్రాంగం ప్రణాళిక రూపొందించింది.

రికార్డుస్థాయిలో పనులు
కాళేశ్వరం విజయవంతంలో కీలకపాత్ర పోషించనున్న శ్రీరాజరాజేశ్వర జలాశయం అందుబాటులోకి రావడం తెలంగాణ రైతాంగానికి గొప్ప విజయం. సమైక్యపాలనలో ఈ రిజర్వాయర్‌ పనులు మొదలైనా పనుల్ని పూర్తిచేయడంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డుస్థాయిలో పరుగెత్తాల్సివచ్చింది. 2008 నుంచి 2014 వరకు 47 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని మాత్రమే జరిగింది. మొత్తం 4.80 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకుగాను పదేండ్ల వ్యవధిలో 52 వేల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే పూర్తిచేశారు. గేట్ల బిగింపునకు సంబంధించి 3,500 మెట్రిక్‌ టన్నుల పనులను పదేండ్ల కాలంలో మొదలే పెట్టలేదు. పనుల పరిస్థితి ఇలాఉంటే.. పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్‌) ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడేండ్ల రెండు నెలల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో పనులు పూర్తిచేసింది. 81 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపనితో పాటు మిగిలిన 4.28 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. దీంతోపాటు 3,500 మెట్రిక్‌ టన్నుల గేట్ల బిగింపు పనుల్ని కూడా పూర్తిచేసింది. ఆర్‌అండ్‌ఆర్‌ను ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టడం వల్లనే ఇప్పుడు సాఫీగా నీటిని నిల్వచేసుకొనే పరిస్థితి వచ్చింది.

సాంకేతిక ప్రొటోకాల్‌ కీలకం
ఈ ఏడాది ఎల్లంపల్లి నుంచి జలాలను శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలించడంలో ఇరిగేషన్‌ అధికారులు సాంకేతికంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని అడుగులు వేయాల్సివచ్చింది. నిజానికి ఒక కొత్త రిజర్వాయర్‌ను నింపడంలో సాంకేతిక ప్రొటోకాల్‌ అన్నది కీలక భూమిక పోషిస్తుంది. దానిని అనుసరించకుండా ముం దుకుపోతే.. అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముంటుందని ఒక ఇంజినీరు చెప్పారు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఇంజినీర్లు ముందుగా 25.87 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వసామర్థ్యమున్న జలాశయంలో 15 టీఎంసీలను మాత్రమే నింపారు. అంచెలంచెలుగా పరిశీలిస్తూ.. సీపేజ్‌ను గమనిస్తూ నిల్వను పెంచుకుంటూపోయారు. ఈ క్రమంలో కొంత ఇబ్బంది వచ్చినా దాన్ని అధిగమించారు. తర్వాత రెండోదశలో పూర్తిస్థాయిలో జలాశయాన్ని నింపడం సులువైంది. ప్రస్తుతం జలాశయంలో 23 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. అంటే.. జలాశయంలో 89 శాతం నిల్వ చేరటం విశేషం. ఈ స్థాయిలోనే సాంకేతిక పరిమితికి లోబడి (30 శాతానికి లోబడి) సీపేజ్‌ ఉన్నట్లుగా అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో 25 టీఎంసీలకుపైగా నీటిని నింపేందుకు అవకాశం ఉన్నప్పటికీ అధికారులు.. లోయర్‌ మానేర్‌డ్యాంకు నీటిని విడుదల చేయడంపై దృష్టిసారించారు. ఆదివారం సాయంత్రానికి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి 6,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అవుట్‌ఫ్లో 5,856 క్యూసెక్కులుగా కొనసాగుతున్నది.

About The Author