లైంగిక దాడి యత్నం; తండ్రికి పదేళ్ల జైలు


విశాఖ లీగల్‌: కన్న కూతురుపై లైంగిక దాడికి యత్నించిన తండ్రికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ నగరంలోని ఒకటో అదనపు జిల్లా కోర్టు(పోక్సో చట్ట పరిధిలోని నూతన న్యాయస్థానం) న్యాయమూర్తి ఎ.వి.పార్థసారథి శుక్రవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.వేణుగోపాలరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. నిందితుడు డారక్‌ హయిస్‌(37) నగరంలోని బీచ్‌ రోడ్డులో ఉంటున్నాడు. అతనికి వివాహం జరిగి, 12 ఏళ్ల కుమార్తె ఉంది. నేరం జరగడానికి ముందు కొన్ని కారణాల వల్ల భార్యాభర్తలు చట్టరీత్యా విడిపోయారు. బాధితురాలి తల్లి విదేశాల్లో ఉంటున్నారు. బాలిక తన అమ్మమ్మ దగ్గర ఉంటోంది.

కుమార్తెను చూడడానికి నిందితునికి కోర్టు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో బాలిక తరచూ తండ్రి దగ్గరకు వెళ్లేది. ఇదే అదునుగా నిందితుడు డారక్‌ హయిస్‌ 2014 అక్టోబర్‌ 22వ తేదీ రాత్రి బాలిక నిద్రిస్తున్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి కూడా యత్నించినట్టు ఆమె కోర్టులో వివరించింది. బాధితురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు త్రిటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేసి అప్పటి ఏసీపీ నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ కీలకమైన ఐదుగుర్ని విచారించింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. విశాఖలో గత అక్టోబర్‌ 2న ఏర్పాటైన పోక్సో చట్టం–2012 పరిధిలోని నూతన న్యాయస్థానంలో ఇదే తొలితీర్పు కావడం విశేషం.

About The Author