వార్నీ… ఇడిగో కిమ్…


ఉత్తర కొరియా తిరుగులేని నేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ బతికే ఉన్నాడు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఆయన ఆరోగ్యం విషమించిందని, గుండెకు శస్త్ర చికిత్స చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతతో ఆయన మరణించాడని కూడా వదంతులు వ్యాపించాయి. ఆయన ఆరోగ్యంపై మా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, తర్వాత వెల్లడిస్తా అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ వదంతులకు మరింత సస్పెన్స్‌ జోడించారు. అయితే, హఠాత్తుగా ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థలు ఆయన బతికే ఉన్నాడనడానికి సాక్ష్యాలుగా ఒక ఎరువుల కంపెనీ ప్రారంభోత్సవానికి కిమ్‌ హాజరైనట్టు ఫొటోలు, వార్తలు వెల్లడించాయి. ఉత్తర కొరియా నగరం సంచాన్‌లో కిమ్‌ ఒక ఎరువుల ఫ్యాక్టరీని తన సోదరి కిమ్‌ యో జాంగ్‌తో కలిసి ప్రారంభించారని, ఇందులో సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారని తెలిపింది. అధికారిక రోడాన్‌ సింగ్‌మున్‌ వార్తాపత్రికలో ఆయన రిబ్బన్‌ కట్‌ చేస్తున్న ఫొటోతో సహా పలు వివరాలను ప్రచురించింది. నల్లటి డ్రెస్‌ ధరించిన కిమ్‌ అందులో నవ్వుతూ హుషారుగా కనిపించారు. వేలాది మంది కార్మికులు మాస్క్‌లు ధరించి ఈ సందర్భంగా బెలూన్లు వదులుతున్న ఫొటోలను కూడా వార్తా పత్రికలో ప్రచురించారు. కిమ్‌ యో జాంగ్‌ అధికారికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పక్కనే ఉండడం విశేషం. కాగా, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అకస్మాత్తుగా కొన్ని రోజుల పాటు మాయం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అంటే 2014 సెప్టెంబర్‌లో కూడా ఆయన 40 రోజుల పాటు అజ్ఞాతంలో గడిపారు. మళ్లీ అదే ఏడాది అక్టోబర్‌ మధ్యలో ప్రత్యక్షమయ్యారు. ఆయన కుడి పాదానికి శస్త్ర చికిత్స జరిగిందని ఆ తర్వాత దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించాయి.

About The Author