ఆరోగ్య సేతు యాప్‌పై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు…


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్యసేతు యాప్‌పై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదో పనికిమాలిన యాప్ అని అన్నారు. ఈ యాప్ వినియోగించే వారి డేటా నిరర్ధకంగా మారే ప్రమాదం కనిపిస్తోందని ఈ మేరకు ఒవైసీ ట్వీట్ చేశారు. అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న కరోనా వైరస్‌ను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నమ్మదగినదిగా లేని ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌తోను ఎదుర్కోవాలని చూడడం దురదృష్టకరమని అసదుద్దీన్ పేర్కొన్నారు. అయితే నేరుగా ప్రధాని మోదీని , కేంద్ర ప్రభుత్వం పేరును ప్రస్తావించలేదు అసద్. కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ సుల్తానులుగా అభివర్ణించారు. ఈ యాప్‌ను వినియోగిస్తే అందులో వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సి ఉంటుందని.. అది వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని ఓవైసీ ఆరోపిస్తున్నారు. అసద్ ట్వీట్‌పై వాడి వేడి చర్చ జరుగుతున్నట్టు సమాచారం. కాగా, ఈ యాప్ ద్వారా కరోనా ఉందా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు. అలాగే కరోనా సోకినవారు సమీపంలో ఉంటే ఈ యాప్ అప్రమత్తం చేస్తుంది. 130 కోట్ల భారతీయుల ఆరోగ్యం , క్షేమ సమాచారం తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం ఈ వినూత్న యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే చాలామంది ఈ యాప్‌ను తమ ఫోన్‌లలో నిక్షిప్తం చేసుకుని కరోనా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్య సేతు యాప్‌పై ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

About The Author